ఇస్రో... జులై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్-2 వ్యోమనౌకను జాబిల్లిపైకి పంపింది. ఆ తర్వాత వివిధ దశల్లో చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2 చేరుకుంది. కేవలం 42 రోజుల్లోనే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరుపడింది. ఈ ప్రయోగంలో తుది ఘట్టం.. అత్యంత కీలకమైన, క్లిష్టమైన ప్రక్రియ విక్రం ల్యాండర్ చంద్రునిపై అడుగుపెట్టడం.
అగ్రదేశాల సరసన భారత్
ఈ ప్రక్రియ విజయవంతమైతే భారత్ అగ్రదేశాల సరసన నిలుస్తుంది. జాబిల్లి పైకి వ్యోమనౌకలను పంపిన రష్యా, అమెరికా, చైనా తర్వాత నాల్గవ దేశంగా అవతరిస్తుంది. అయితే చందమామ దక్షిణ ధ్రువంపై అన్వేషణకు ప్రప్రథమంగా ప్రయోగం చేపట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర పుటలకెక్కింది.
ఈ నెల 2న విక్రమ్ ల్యాండర్.. ఆర్బిటర్ నుంచి విజయవంతంగా విడిపోయింది. రెండుసార్లు కక్ష్యను కుదించటం ద్వారా చంద్రునికి చేరువైంది. వ్యోమనౌక గమనాన్ని 'ఇస్రో టెలిమెట్రీ'లోని 'మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్', బెంగళూరుకు సమీపంలోని బయాలులోని 'డీప్ స్పేస్ నెట్వర్క్' యాంటెనా సాయంతో 'ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్' నుంచి పర్యవేక్షించారు. ఈ నెల 7న ప్రజ్ఞాన్ రోవర్ కలిగిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుని ఉపరితలంపై కాలిడనుంది.
అత్యంత క్లిష్టమైన ప్రక్రియ
ఆ రోజు రాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య జాబిల్లిపై ల్యాండర్ దిగే ప్రక్రియ మొదలు కానుంది. రాత్రి ఒకటిన్నర, రెండున్నర గంటల మధ్య ల్యాండర్ చంద్రునిపై కాలుమోపనుంది. ప్రస్తుతం ఈ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టే ప్రదేశానికి 35 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఉంది. దక్షిణాన 70 అక్షాంశాల మధ్య ఎత్తయిన మైదాన బిలాలు 'మాంజినియస్-C', 'సింప్లియస్-N' మధ్య సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో తెలిపింది. గతంలో ఎప్పుడూ చేపట్టని ఈ ప్రక్రియ అత్యంత క్లిషమైనదని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ పేర్కొన్నారు.
"30 కిలోమీటర్ల దూరంలోని కక్ష్య నుంచి చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 15 నిమిషాల సమయం పడుతుంది. 15 నిమిషాల ఈ ప్రయాణం ఇస్రోకు కొత్త అనుభవం. వాతావరణంలేని చోటికి వ్యోమనౌకను పంపటం ఇది మొదటిసారి. వేగ నియంత్రణ చేసేందుకు ప్రొపల్షన్ విధానం ద్వారా వ్యోమనౌకను సురక్షితంగా ల్యాండింగ్ చేయబోతున్నాం. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ తెల్లవారుజామున 5.30, ఆరున్నర గంటల ప్రాంతంలో విడిపోతుంది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ ఒక రోజు పాటు చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేస్తుంది. చందమామపై ఒకరోజు అంటే భూమిపై 14 రోజులతో సమానం. ప్రధాన ఆర్బిటర్ మిషన్ ఏడాది పాటు కొనసాగుతుంది."
-కె.శివన్, ఇస్రో ఛైర్మన్