భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టులో.. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం నాసాతో కలిసి ప్రయత్నాలు చేస్తోంది ఇస్రో. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) తన డీప్ స్పేస్ నెట్‌వర్క్ (డీఎస్‌ఎన్)లోని భూ కేంద్రాల ద్వారా విక్రమ్‌కు రేడియో తరంగాలను పంపింది.
దక్షిణ కాలిఫోర్నియాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఉన్న నాసా డీఎస్‌ఎన్ కేంద్రాల నుంచి 12 కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను జాబిల్లి మీదకు ప్రసరింపచేస్తోంది. భూ కేంద్రంతో కమ్యూనికేషన్ సాగించేలా ల్యాండర్‌ను ప్రేరేపించడం దీని ఉద్దేశం. సుదూరపు విశ్వంలోని వ్యోమనౌకలు కనీసం ఏదో ఒక కేంద్రంతో సంబంధాలను కొనసాగించేలా చూడటం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు సౌర కుటుంబం అంచులవరకూ కమ్యూనికేషన్ సాగించగలవు. ఆ కేంద్రాల్లోని భారీ యాంటెన్నాలతో ఏకకాలంలో అనేక వ్యోమనౌకలతో కమ్యూనికేషన్‌ను సాగించవచ్చు.
రోజులు గడిచేకొద్దీ ల్యాండర్ పునరుద్ధరణ అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. జాబిల్లిపై 14 రోజుల పగటి సమయం ఈ నెల 20-21తో ముగుస్తుంది. ఆ తర్వాత విక్రమ్‌లోని సౌరఫలకాలకు శక్తి అందదు. ఆ పరిస్థితుల్లో వ్యోమనౌకపై ఆశలు వదులుకోవాల్సిందే.