తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాసేపట్లో చంద్రయాన్​-2 ప్రయోగం - భారత్​

భారత్​ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్​-2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్​ ఇందుకు వేదికగా నిలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 43 నిముషాలకు చంద్రయాన్​-2 ఉపగ్రహాన్ని జీఎస్​ఎల్​వీ మార్క్​-3 ఎం-1 రాకెట్​ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేపట్టి.. అక్కడ నీరు, ఇతర రసాయనాలను గుర్తించే దిశగా చంద్రయాన్​-2 ప్రయోగం జరుగుతోంది.

నేడే చంద్రయాన్​-2 ప్రయోగం

By

Published : Jul 22, 2019, 5:06 AM IST

Updated : Jul 22, 2019, 2:05 PM IST

ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోన్న చంద్రయాన్​-2 ప్రయోగం.. మరికాసేపట్లో శ్రీహరికోటలోని షార్ వేదికగా జరగనుంది. సతీశ్​ ధావన్​ స్పేస్ సెంటర్​- షార్​లోని రెండో ప్రయోగ వేదికపై.. కౌంట్ డౌన్ విజయవంతగా కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 43 నిముషాలకు చంద్రయాన్​-2 ఉపగ్రహాన్ని జీఎస్​ఎల్​వీ మార్క్​-3 ఎం-1 నింగిలోకి తీసుకెళ్లనుంది.

మరో చరిత్ర సృష్టించే దిశగా..

చందమామపై మనిషి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయింది. ఇదే సమయంలో.. మరోసారి చంద్రమండల యాత్రకు ఇస్రో నడుం బిగించింది. 2008లో చంద్రయాన్​-1ను నిజం చేసిన ఇస్రో... 11 ఏళ్ల తరువాత చంద్రయాన్​-2కు సర్వం సిద్ధం చేసింది. వాస్తవానికి ఈ నెల 14నే ప్రయోగం జరగాల్సి ఉంది. క్రయోజనిక్ దశలో వచ్చిన సాంకేతిక లోపాన్ని ముందుగానే గుర్తించిన శాస్త్రవేత్తలు... 56 నిమిషాల ముందు ప్రయోగాన్ని వాయిదా వేశారు. తాజాగా.. ఈ లోపాలను సరిచేసి, ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇస్రో ఛైర్మన్ శివన్​ తెలిపారు.

ఇదీ ప్రత్యేకత

చంద్రయాన్​-2 ఉపగ్రహం బరువు 3,447 కిలోలు. దీనిని ఆర్బిటర్, ల్యాండర్, రోవర్​తో అనుసంధానం చేశారు. వీటిలో ఆర్బిటర్ చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ సమాచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్​ చంద్రునిపై దిగుతుంది. ల్యాండర్​లోని రోవర్​ జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్లపై పరిశోధనలు చేస్తుంది.

ఫలితానికి నిరీక్షణ తప్పదు

ప్రయోగం జరిగిన 5 రోజుల తర్వాత భూనియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్​-2 ఉపగ్రహం ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి 3.5 లక్షల కిలోమీటర్ల దూరమున్న చంద్రుని వైపు పయనిస్తుంది. ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్న తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి సెప్టెంబర్​ 6,7 తేదీల్లో జాబిల్లి దక్షిణ ధ్రువం దగ్గర నెమ్మదిగా దిగుతుంది.
అందులో నుంచి రోవర్​ బయటకు వచ్చి 30 నుంచి 400 కిలోమీటర్ల మేర పయనిస్తుంది. అక్కడ 14 రోజులపాటు ఉండి చంద్రుడి ఉపరితలాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి చిత్రాలను, సమాచారాన్ని 15 నిమిషాల్లో పంపనుంది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో..

చంద్రయాన్​-2 ప్రాజెక్టులో పూర్తి స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించారు. ఇందులో ల్యాండర్​కు విక్రమ్, రోవర్​కు ప్రజ్ఞాన్​ అని నామకరణం చేశారు. చంద్రయాన్​-2 ఉపగ్రహ తయారీకి 603 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జీఎస్​ఎల్​వీ మార్క్​-3 ఎం-1 వాహకనౌక రూపకల్పనకు 375 కోట్ల రూపాయలు వ్యయం చేశారు.

నీరు, రసాయనాలు గుర్తిస్తుంది..

చంద్రునిపై పరిశోధనలు చేసే ప్రజ్ఞాన్​ రోవర్​.. ఇస్రో పంపే ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూనే... కాస్త సొంత బుర్రనూ వాడుతుంది. ఈ రోవర్ కదలిక కోసం యంత్రంలో అల్యూమినియంతో తయారుచేసిన 6 ప్రత్యేక చక్రాలు అమర్చారు. ఏ దారిలో వెళ్లాలో తేల్చుకునేందుకు నేవిగేషన్​ కెమెరా, ఇన్​క్లైనోమీటర్​ ఉన్నాయి. చంద్రుని ఉపరితలంలో కూరుకుపోకుండా నడిచేలా దీని చక్రాలకు విడివిడి మోటార్లను అమర్చారు. నీటి అణువులు, ఖనిజాలను గుర్తించే విధంగా ఇమేజింగ్​ ఐఆర్ స్పెక్ట్రోమీటర్, సింథటిక్ అపెర్చర్​ రాడార్​ను ఏర్పాటు చేశారు. వీటి సాయంలో ప్రజ్ఞాన్​ రోవర్​ అక్కడికక్కడే 15 రకాల పరీక్షలు చేసి నీటి జాడలను గుర్తిస్తుంది.

అపూర్వ విజయం దిశగా..

చంద్రయాన్​-1 జాబిల్లిపై నీటిని గుర్తించగా.. చంద్రయాన్​-2 మరింత లోతుగా పరిశోధించనుంది. జాబిల్లి పుట్టుక గురించి తెలుసుకునేందుకు అవసరమైన సమాచారాన్నీ అందించే ప్రయత్నం చేస్తుంది. చంద్రునిపై ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు వీలుందా? అన్న ప్రశ్నకు సమాధానం దొరుకే అవకాశముంది. అలాగే.. జాబిల్లిపై వ్యర్థాల్లేని అణుశక్తి మూలకాల కోసం అన్వేషించనుంది. ఇందుకోసం ఏ దేశమూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ఈ ప్రయత్నం సఫలమైతే అమెరికా, సోవియట్​ యూనియన్​, చైనా తరువాత చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్ చేసిన దేశంగా భారత్​ ఘనత సాధించనుంది.

ఇదీ చూడండి: కర్​'నాటకం': 'బలపరీక్ష'పై పోటాపోటీ చర్చలు...

Last Updated : Jul 22, 2019, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details