కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వైరస్ మరింత వేగంగా విస్తరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎందుకు ఎత్తివేసిందని ప్రశ్నించారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
" కొవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్న సమయంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన ఏకైక దేశం భారత్. నాలుగు దశలుగా విధించిన లాక్‌డౌన్.. ప్రధానమంత్రి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దేశంలో లాక్‌డౌన్ ఉద్దేశ్యం, లక్ష్యం విఫలమయ్యాయన్నది సుస్పష్టం. భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి.. విఫలమైన లాక్‌డౌన్ ఫలితమే. కరోనా అంటువ్యాధి ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో లాక్‌డౌన్ ఎత్తేసి.. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది. నిబంధనలు సడలించడంలో ప్రభుత్వ వ్యూహం ఏమిటి? వలస కార్మికులు, రాష్ట్రాలకు ఈ వ్యూహం ఏ విధంగా సాయపడుతుందని అనుకుంటోంది.