జమ్ముకశ్మీర్‌లో ప్రత్యేకించి శ్రీనగర్‌లో స్థానికులు.. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి దేశంలోనే అధిక సంఖ్యలో ముస్లింలు గల రాష్ట్రంలో తమ ప్రత్యేక హక్కులను హరించివేశారని చెబుతున్నారు.
కేంద్రం నిర్ణయంతో కశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు, వేర్పాటువాదులకు మధ్య గీతను చెరిపేసే పరిస్థితి ఏర్పడిందంటున్నారు స్థానికులు. అన్ని రాజకీయపార్టీలు ఏకమై కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా పోరాటం చేయాలని కోరుతున్నారు.
"ఇది పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, హురియత్ పార్టీలకు సంబంధించిన అంశం కాదు. కశ్మీరీలు, మెజారిటీ ముస్లింలకు సంబంధించిన విషయం. కశ్మీర్ లోయలో అధిక జనాభా గల వారిపై ప్రభావం చూపే విధంగా భాజపా తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోవాలి."
-ఐజాజ్ భట్, స్థానిక వ్యాపారి
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వెన్నుపోటు, ద్రోహంతో సమానమని అభిప్రాయపడ్డారు భట్. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ పదే పదే ప్రజలకు చెప్పేవారని తెలిపారు.