జమ్ము కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడగింపునకు పార్లమెంటు ఆమోదం తర్వాత సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. రాజకీయ, ఆర్థిక స్థిరత్వం ఏర్పడేందుకు మూడు భిన్న వ్యూహాలను కేంద్రం అనుసరిస్తోందన్నారు.
- పాలనా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించటం
- వేర్పాటు వాద సంస్థల నుంచి ఉగ్రవాదులను వేరు చేయటం
- పంచాయితీ వ్యవస్థ బలోపేతం
షా పర్యటన కీలకం
కశ్మీర్లో జూన్ 26 నుంచి 27 వరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. ఉన్నతాధికారులతో సమావేశాల్లో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అనూహ్య మార్పులు రావాలని ఈ భేటీల్లో షా ఆదేశించినట్టు సమాచారం. పాలనలో పారదర్శకత, అవినీతిపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కరాఖండిగా చెప్పారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో ముఖ్యమైన అంశాలు...
- పౌర విభాగాలు జవాబుదారీగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పని చేయాలి.
- అనవసర శాఖలను రద్దు చేసి ప్రజలతో అధికారులు మమేకం కావాలి. ఇందుకు సీనియర్ అధికారులు గ్రామాల్లో పర్యటించాలి.
- ప్రజల్లో తీవ్రవాదంపై ఉన్న భయాలను పోగొట్టాలి. ఇందుకు సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసులు, బీఎస్ఎఫ్ ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలి.