భీమా కొరెగావ్ కేసును కేంద్ర ప్రభుత్వం.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేసింది. అయితే కేంద్రం నిర్ణయంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కేసును ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాను ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. భాజపా ఎందుకు భయపడుతోంది? ఉన్నట్లుండి మహారాష్ట్ర పోలీసులపై వారికెందుకు నమ్మకం పోయిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును పుణె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే కేసును ఎన్ఐఏకు అప్పగించారన్న వార్తలపై అటు కేంద్ర హోంశాఖ గానీ ఇటు ఎన్ఐఏ ప్రతినిధులు గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. భీమా కొరెగావ్ కేసుకు సంబంధించి పూర్తి సమారాన్ని బయటపెట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఇటీవలే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కేసును ఎన్ఐఏకు అప్పగించడం గమనార్హం.