ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ నవంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ ధర సుమారు వెయ్యి రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. ఈ మేరకు భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. అందులో భాగంగా తొలిదశ ప్రయోగాలు ఆశాజనకంగా సాగుతున్నట్లు చెప్పారు.
నవంబర్‌లోగా..
ఆగస్టు ఆఖరు నాటికి అవసరమైన చర్యలు పాటిస్తూనే ఐదు వేల మంది వాలంటీర్లపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు పూనావాలా. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని స్పష్టం చేశారు. అయితే వచ్చే ఏడాది జూన్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.
ఈ ఏడాది చివరినాటికి..
వ్యాక్సిన్ అభివృద్ధిలో సంతృప్తికర పురోగతి సాధిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా.. 2020 చివరి నాటికి 30 కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యంగా పని చేస్తున్నట్లు పూనావాలా స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పారు. ఒకటి, రెండు వారాల్లో వాటిపై అధ్యయనంతో సహా.. ట్రయల్స్‌ను డీజీసీఏ పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. రోగులపై ప్రయోగించేందుకు మరో 3 వారాలు పడుతుందన్న పూనావాలా.. నెల రోజుల్లో పుణె, ముంబయిలోని 5 వేల మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ కోసం ఆక్స్‌ఫర్డ్‌తో జతకట్టిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. భారత్ సహా 60 దేశాలకు వాక్సిన్ ఉత్పత్తితో పాటు సరఫరా కూడా చేయనుంది.
ఇదీ చదవండి:ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ బాగుంది.. కానీ?