'టీకా పంపిణీ తొలి దశలో భాగంగా.. కరోనా యోధులకు వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దాదాపు మూడు కోట్లమందికి అయ్యే వ్యయం కేంద్రమే భరిస్తుందని చెప్పారు. కరోనాపై పోరులో ముందుండి సేవ చేస్తున్న వారికే తొలుత టీకా అందుతుందని పేర్కొన్నారు. ఈ జాబితాలో ప్రజా ప్రతినిధులు ఉండరని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ పంపిణీ సహా దేశంలో కొవిడ్ పరిస్థితిని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు మోదీ.
"రెండు టీకాలు భారత్‌లో తయారైనవే కావడం గర్వకారణం. విదేశీ వ్యాక్సిన్లపై ఆధారపడాల్సివస్తే దేశం ఎంత ఇబ్బందులు పడేదో! తొలి దశ వ్యాక్సిన్లు హెల్త్‌కేర్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసమే. వేరే వ్యక్తులు తీసుకోకూడదని నేను వ్యక్తిగతంగా సూచిస్తున్నా. ప్రజాప్రతినిధులైన మేము అందులో భాగం కాదు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుందని పునరుద్ఘాటించిన మోదీ.. వచ్చే కొద్ది నెలల్లో 30 కోట్ల మంది పౌరులకు టీకా అందించనున్నట్లు తెలిపారు. రెండో దశలో 50ఏళ్లు పైబడిన వారు, ఇతర రోగాలు ఉన్న 50ఏళ్లలోపు వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
మనదే చౌక
ప్రపంచంలోని ఇతర టీకాలకన్నా.. భారత్‌లో తయారైన వ్యాక్సిన్లు అత్యంత చౌక ధరకే లభిస్తాయని మోదీ తెలిపారు. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చామని, త్వరలోనే మరో నాలుగింటిని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. టీకా పంపిణీ రెండో దశకు చేరే సరికి మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వ్యాక్సినేషన్‌తో భారత్‌లో కరోనా పోరు నిర్ణయాత్మక దశకు చేరనుందని అన్నారు.