ఉద్యోగుల్లో పని సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అలసత్వం, ఆశ్రితపక్షపాతం, అవినీతిలాంటి జాఢ్యాలతో సరిగా పనిచేయని వారిని నిర్బంధ ఉద్యోగ విరమణ నిబంధనల కింద 30 ఏళ్ల సర్వీసు లేదంటే.. 50/55 ఏళ్ల వయోపరిమితి దాటిన వెంటనే ఇంటికి పంపించేలా ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ఫండమెంటల్ రూల్స్ 56(జె), (ఐ), రూల్ 48 సీసీఎస్ (పెన్షన్)-1972ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
'ప్రభుత్వ కార్యకలాపాల్లో సామర్థ్యంతోపాటు, ఆర్థిక వేగం పెంచాలంటే అన్ని స్థాయిల్లో పరిపాలనా వ్యవస్థ బలోపేతంగా ఉండాలి. బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా పనిచేయాలి. ఈ నిబంధనల కింద ప్రభుత్వ ఉద్యోగులతో ముందస్తు పదవీ విరమణ చేయించడం జరిమానా ఏమీకాదు. నిర్బంధ పదవీ విరమణకు, దీనికి తేడా ఉంది. నిర్బంధ పదవీ విరమణ సీఎస్‌ఎస్ (సీఏఏ) నిబంధనలు-1965లో శిక్ష విధించడం కిందికి వస్తుంది. ఈ ముందస్తు పదవీ విరమణ ఆ నిబంధన కిందికి రాదు' అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఫండమెంటల్ రూల్ 56(జె), (ఐ), రూల్ 48(1), (బి) ఆఫ్ సీసీఎస్ (పెన్షన్) రూల్స్ 1972 కింద ప్రజా ప్రయోజనం అని భావిస్తే 30 ఏళ్ల సర్వీసు, 50/55 ఏళ్లవయసు వారితో పదవీ విరమణ చేయించొచ్చని తెలిపింది. ఇలా చేయించడం ప్రజాప్రయోజనం కిందికి వస్తుందని సంబంధిత అధీకృత సంస్థ భావిస్తే మూడు నెలలు ముందుగా లిఖితపూర్వక నోటీసు కానీ, మూడునెలల జీతభత్యాలు కానీ ఇచ్చి రిటైర్‌మెంట్ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టంచేసింది. ఒకవేళ ఎవరైనా గ్రూప్ ఎ, బి సర్వీసులోకి కానీ, లేదంటే అందుకు సమానమైనదాంట్లోకి కానీ తాత్కాలికంగానైనా శాశ్వత ప్రాతిపదిక మీదైనా 35 ఏళ్ల వయసులోపు చేరి ఉంటే అలాంటి వారికి 50 ఏళ్లు వచ్చిన తర్వాత పదవీ విరమణ చేయించొచ్చని పేర్కొంది. ఒక వేళ ఏదైనా ఇతరత్రా పరిస్థితులుంటే 55 ఏళ్లు వచ్చిన తర్వాతైనా పంపొచ్చని ఫండమెంటల్ రూల్ 56 (జె) కింద పేర్కొంది.
- ఎఫ్‌ఆర్56(ఐ) ప్రకారం గ్రూప్-సి ఉద్యోగులు, లేదంటే పెన్షన్ నిబంధనల కిందికి రాని ఉద్యోగులను 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని మూడు నెలల ముందస్తు నోటీసు లేదంటే మూడునెలల జీతభత్యాలిచ్చి ఇంటికి పంపొచ్చని స్పష్టంచేసింది.
- రూల్ 48(1) (బి) ఆఫ్ సీసీఎస్ (పెన్షన్) రూల్స్-1972 కింద ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారితో పదవీ విరమణ చేయించినా అతనికి పదవీవిరమణ పెన్షన్ హక్కులు ఉంటాయని పేర్కొంది.
- ప్రతి మూడునెలలకోసారి సిబ్బంది పనితీరును సమీక్షించి అందులో ఇంటికి పంపించాల్సిన వారిని గుర్తిస్తారు.
- అన్ని శాఖల్లో 50/55 ఏళ్ల వయసు వచ్చిన వారు, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారి రిజిష్టర్లను ప్రత్యేకంగా నిర్వహించాలి. ఆ రిజిష్టర్‌ను ప్రతి త్రైమాసికం తొలినాళ్లలోనే సమీక్షించి సదరు ఉద్యోగిని ఉంచుకోవాలా, లేదంటే ముందుగా పదవీ విరమణ చేయించాలా? అని నిర్ణయించాలి. ఈ రెండు అంశాల పరిధిలోకి వచ్చిన వారిని ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎప్పుడైనా ఉద్యోగంనుంచి ఉద్వాసన పలికే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు.
- 50/55 ఏళ్లలోపే సమీక్షించాలని ఏమీ లేదని, ఆవయసు మించిన వారి పనితీరుకూడా సమీక్షించి ముందస్తుగా విరమణ చేయించొచ్చని తెలిపారు.
- సాధారణ పదవీ విరమణకు ఏడాది దూరం ఉన్న వారిని అసమర్థత కింద ఇంటికి పంపకూడదు. సదరు వ్యక్తి పనితీరు సామర్థ్యం అకస్మాత్తుగా పడిపోతేతప్ప ఈ చర్యలు తీసుకోకూడదు.
- గత అయిదేళ్లలో పదోన్నతి పొంది, తాను పనిచేసిన ఉన్నత పోస్టులో సంతృప్తికరంగా పనిచేసిన వారిని అసమర్థత పేరుతో పదవీ విరమణ చేయించకూడదు. ఇలాంటి సమయంలో అతని ఏసీఆర్‌ను పరిగణలోకి తీసుకొని పదోన్నతి మెరిట్ ప్రాతిపదికన వచ్చిందా? లేదంటే సీనియారిటీ, ఫిట్‌నెస్ ప్రకారం వచ్చిందా? అన్నది చూడాలి. కేవలం సీనియారిటీ, ఫిట్‌నెస్ ప్రాతిపదికన పదోన్నతి పొందిన వారికైతే ఈ నిబంధన వర్తించదు.
- పనితీరును సమీక్షించే సమయంలో మొత్తం సర్వీస్ రికార్డును చూడాలి. సర్వీస్ రికార్డు అంటే మొత్తం వ్యవహారాలు చూడాలి. కేవలం ఏసీఆర్/ఏపీఏఆర్ డోసియర్‌లకు మాత్రమే పరిమితం కాకూడదు. ప్రభుత్వ ఉద్యోగి వ్యక్తిగత దస్త్రంలో విలువైన సమచారం ఉంటుంది. అందువల్ల అతను చూసిన ఫైళ్ల ఆధారంగా అతని పని, ప్రతిభను అంచనావేయాలి. మంత్రిత్వశాఖ/ విభాగం/ కేడర్ కలిసి రివ్యూ కమిటీకి సమగ్ర నివేదిక అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఏసీఆర్/ఏపీఏఆర్‌లలోని అన్-కమ్యూనికేటెడ్ రిమార్క్స్‌ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.