భారత్‌లో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక.. దేవదేవుడైన పూరీ జగన్నాథుడికి ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర. దేవతలంతా కదలి వస్తారని భక్తులు విశ్వసించే ఈ యాత్రకు.. సాధారణంగా అయితే ప్రజల తాకిడి లక్షల్లో ఉంటుంది. కరోనా నేపథ్యంలో భక్తుల రాకపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించిన కారణంగా పూరీ పట్టణంలో జగన్నాథుడు ఒక్కడే ఊరేగనున్నాడు. భక్తులు ఇళ్లల్లోనే తమ ఇష్టదైవాన్ని టీవీలు, మొబైళ్ల వేదికగానే ఆరాధించనున్నారు.
రథాన్ని లాగే ఛాన్స్.. ఈ సారి మిస్
బలభద్రా సమేతుడై ఠీవీగా కదిలి వచ్చే జగన్నాథుడి రథాన్ని ఒక్కసారైనా లాగి తరించాలని ప్రతి భక్తుడి కోరిక. లోకాలను ఏలే రథారోహుడు ఆ జగన్నాథుడి దివ్య మంగళ రూపాన్ని కనుల నిండా చూడాలని.. రథాన్ని లాగి జన్మను ధన్యం చేసుకోవాలని అనుకుంటున్న భక్తుల కోరికకు ఈ సారి కరోనా అడ్డుపడింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఒక్కో రథం గంట వ్యవధితో ఊరేగనుంది.
గతంలో పూరీ జగన్నాథుని రథయాత్ర.. గజపతి మహారాజు హామీతో..
రథయాత్రలో తక్కువమంది మాత్రమే హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు అఫిడవిడ్ సమర్పించింది. కేవలం 500ల మంది మాత్రమే రథాన్ని లాగేందుకు అనుమతించనున్నారు. ఇందులో పోలీసులు, అధికారులు కూడా భాగమవుతారు.
అంతటా కర్ఫ్యూ..
రథయాత్ర సమయంలో పట్టణంలో కర్ఫ్యూను విధించారు అధికారులు. సోమవారం రాత్రి 9 గంటలకే ప్రారంభమైన కర్ఫ్యూ.. బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండగలో 50 ప్లాటున్ల దళాలను భద్రత కోసం మోహరించారు.
చరిత్రలో ఇదే మొదటిసారి..
జగన్నాథ రథ యాత్ర నిర్వహణ, దాని తీరుతెన్నులపై ప్రశ్నలు తలెత్తుతుండగానే వందల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని ఆపేది లేదని దేవస్థానం అర్చకులు, నిర్వాహకులు అంటున్నారు. ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న దైతపతి సేవకులు 18వ శతాబ్దంలో తీవ్రమైన కరవు వచ్చినపుడు కూడా రథయాత్రను ఆపలేదని గుర్తు చేస్తున్నారు. భక్తులు లేకుండా తామే నిర్వహిస్తామని అంటున్నారు. భక్తులు లేకుండా రథాన్ని లాగేది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతుండగా, తమ కుటుంబంలోని 36 మంది నియోగులు రథాన్ని లాగుతారని దైతపతి సేవకులు చెబుతున్నారు. జగన్నాథుడి పవిత్ర స్నానం జరిగేటప్పుడు పాటించే నిబంధనలు పాటిస్తే సరిపోతుందని అంటున్నారు.
ఏర్పాట్లు ఆగలేదు..
జగన్నాథ రథయాత్రపై సుప్రీంలో పిటిషన్ కారణంగా సందిగ్ధత నెలకొన్నా అందుకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు మాత్రం యథావిధిగా జరిగాయి. యాత్రలో వినియోగించే మూడు రథాల తయారీని ఎప్పటిలాగే కొనసాగించారు. 200 మంది పనివాళ్లు రథాలను నిర్మించే పనుల్లో భాగం పంచుకున్నారు.
ఇదీ చూడండి:పూరీ రథ యాత్ర షెడ్యూల్ ఇదే..