మరణ శిక్ష విధించిన దోషులకు.. న్యాయపరమైన హక్కులను సవరించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. డెత్ వారెంట్ జారీ చేసిన 7 రోజుల్లోనే మరణ శిక్ష అమలు చేయాలని కోరింది. నిర్భయ కేసులో దోషుల ఉరి ప్రక్రియ ఆలస్యం చేయడాన్ని ఈ సందర్భంగా పిటిషన్లో ప్రస్తావించింది కేంద్రం.
రివ్వూ పిటిషన్ తిరస్కరించిన తరువాత క్షమాభిక్షకు, క్యురేటివ్ పిటిషన్లకు కచ్చితమైన కాలపరిమితి నిర్దేశించాలని కోరింది. దీనికి ఎక్కువ సమయం ఉండటంతో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది కేంద్రం. వారికున్న న్యాయపరమైన అవకాశాల కారణంగా శిక్ష ఆలస్యమయ్యేలా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది కేంద్రం.
'నిర్భయ'లో ఇదీ జరిగింది..
న్యాయపరమైన అవకాశాలతో.. నిర్భయ ఘటనలో దోషులు మరణశిక్షను ఆలస్యం చేయడానికి అభ్యర్థిస్తూనే ఉన్నారు. శిక్షా తేదీని ఖరారు చేసినప్పటికీ క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లను అడ్డుగా పెట్టుకొని... ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత జనవరి 22న నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉండగా.. ఈ కారణాలతో తేదీ మారుతూ.. చివరకు ఫిబ్రవరి 1న ఉరి తీయాల్సిందిగా మరో డెత్ వారెంట్ జారీ చేయాల్సి వచ్చింది కోర్టు. ఈ జాప్యంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది.
ప్రజలకు చట్టాల మీద నమ్మకం పోతుంది!
నేరస్థులుగా నిర్ధరించినవారికి శిక్షను త్వరితంగా అమలు చేయాలని కేంద్రం.. సుప్రీం కోర్టును కోరింది. శిక్షా ఖరారు అయిన తరువాత జాప్యం జరిగితే ప్రజలకు చట్టాలు, కోర్టులు మీద నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి:ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే