ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లోక్‌సభలో విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను కాపాడటంలో కేంద్రం విఫలమైందని ధ్వజమెత్తాయి. భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లింది.
విపక్షాల ఆరోపణలను కేంద్రం తిప్పికొట్టింది. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడింది.
సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని లోక్‌సభలో స్పష్టం చేశారు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గహ్లోత్. 2012లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ అంశం తెరపైకి వచ్చిందని వివరణ ఇచ్చారు.
"ఈ విషయంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం అఫిడవిట్‌ను దాఖలు చేయలేదు. ఈ వివాదం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2012లో దాఖలు చేసిన పిటిషన్ ద్వారా తెరపైకి వచ్చింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వద్దని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉంది. సుప్రీంతీర్పుపై మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం."
-థావర్ చంద్ గహ్లోత్, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి
గహ్లోత్ ప్రకటనపై సంతృప్తి చెందని కాంగ్రెస్.. సభ నుంచి వాకౌట్ చేసింది.