'ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు' విధానానికి కేంద్రం సిద్ధమయింది. దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు తీసుకురానున్నట్లు కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాసవాన్ ప్రకటించారు. ఫలితంగా దేశంలో ఎక్కడినుంచైనా సరుకులు పొందవచ్చని తెలిపారు.
ఆహార భద్రతపై కేంద్రం, రాష్ట్రాల్లోని సంబంధిత అధికారులు, ఆయా శాఖల కార్యదర్శులతో పాసవాన్ దిల్లీలో సమావేశమయ్యారు. జాతీయ ఆహార భద్రత చట్టం అమలు, కంప్యూటరైజేషన్, చౌక ధరల సరకుల నిల్వ, పంపిణీలో పారదర్శకత, ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ డిపోలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలను చర్చించారు.
ఎక్కడికి వెళ్లినా ఆహార భద్రత
ఇదే సమావేశంలో రేషన్ కార్డు అంశంపైనా మంత్రి చర్చించారు. నూతన విధానంలో వివిధ రాష్ట్రాలకు తరలివెళ్లే వలసదారులు దేశంలో తమకు అందుబాటులోని దుకాణం నుంచి సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ విధానంతో అవినీతికి ఆస్కారం తక్కువగా ఉంటుందని,ఆహార భద్రత పథకం వృథా కాదని పేర్కొన్నారు.