అయోధ్య కేసుపై త్వరలోనే సుప్రీం తీర్పు వెలువడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ హెచ్చరించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది.
ఉత్తర్ప్రదేశ్లో.. ముఖ్యంగా అయోధ్యలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సుమారు (40 కంపెనీలు) 4000 పారామిలటరీ దళాలను హోంమంత్రిత్వశాఖ మోహరించింది.
అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ సలహా పంపినట్లు హోంమంత్రిత్వశాఖాధికారులు తెలిపారు.
అయోధ్య భూవివాదం కేసుపై సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ 17 లోపు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పదవీవిరమణకు ముందే ఈ కేసుపై తీర్పు వెలువరిస్తారని అంతా భావిస్తున్నారు.