దేశంలో వృద్ధులు ఆహారం దొరక్క అవస్థలు పడే దీనస్థితి తలెత్తకుండా నివారించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిరుపేద వృద్ధులకు రోజూ మధ్యాహ్నం భోజనాన్ని అందించేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. ఇందుకోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు రూపొందించింది.
ఆదరణ కరువైన వారే అజెండా..
'వృద్ధులకు పోషణ్ అభియాన్' పేరుతో ప్రారంభించే ఈ పథకంలో.. కన్నబిడ్డల ఆదరణకు నోచుకోని, అనాథ వృద్ధులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వృద్ధాశ్రమాలు అందుబాటులో లేని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో దాన్ని అమలు చేయనున్నారు. తదనుగుణంగా పంచాయతీలు, మున్సిపాలిటీలను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం త్వరలోనే లేఖ రాయనుంది. 2025 మధ్య కల్లా దేశవ్యాప్తంగా 10వేల గ్రామ పంచాయతీలు, వెయ్యి మున్సిపాలిటీల్లో 2.75 లక్షల మంది వృద్ధులకు ఈ పథకం ఫలాలను అందించాలని కేంద్రం భావిస్తోంది.
మరోవైపు, వృద్ధుల్లో నైపుణ్యాలను పెంపొందిచడమే లక్ష్యంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐదువేల స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:రైతుకు సాయంతోనే ఆత్మనిర్భర్