కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం కొత్త పోస్టుల కల్పనను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే పుస్తకాలు, పబ్లికేషన్లు, డాక్యుమెంట్లు, టేబుల్‌టాప్ క్యాలెండర్ల ముద్రణను నిలిపేసిన ఆర్థికశాఖ తాజాగా జారీచేసిన ఆఫీస్ మెమోరాండంలో మరికొన్ని అంశాలను చేర్చింది. వాటిలో ప్రధానంగా కొత్త పోస్టుల సృష్టిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది.
ఆ పోస్టులకు బ్రేక్.!
కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం ఆమోదం పొందిన పోస్టులు తప్ప మిగతావాటిపై ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. తాజా నిబంధన కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు, అనుబంధ కార్యాలయాలు, చట్టబద్ధ, స్వయంప్రతిపత్తి సంస్థలకు వర్తిస్తుందని పేర్కొంది. కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం అనుమతి లేకుండా, అధికారులు తమ అధికారాలను అనుసరించి ఈ ఏడాది జులై 1 తరువాత ఏవైనా పోస్టులు సృష్టించి ఉంటే వాటిని భర్తీచేయకూడదని ఆదేశించింది. ఒకవేళ వాటిని భర్తీచేయడం అనివార్యమని భావిస్తే అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వ్యయ విభాగానికి పంపాలని షరతు విధించింది.