దేశంలో కొత్తగా 75 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. గత 24 గంటల్లో వైరస్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది. మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 724కు పెరగగా.. మృతుల సంఖ్య 17కు చేరింది.
లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచించారు ఆరోగ్య శాఖ అధికారులు. సామాజిక దూరం పాటించాలన్నారు. దేశంలో ఒక్కరు నిబంధనలను అతిక్రమించినా మనం చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు.
మనం భాగస్వాములమవుతాం..
కొవిడ్-19కు విరుగుడుగా కనిపెట్టబోయే ఔషధం తయారీలో త్వరలో భారత్ కూడా భాగస్వామి కానుందని స్పష్టం చేశారు భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ బలరాం భార్గవ.
వెంటిలేటర్ల కోసం..
వెంటిలేటర్ల కొరత లేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. 30,000 వెంటిలేటర్లను తయారు చేయాలని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను కోరినట్లు వెల్లడించారు.