తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు రైతులతో కేంద్రం మరో దఫా చర్చలు - farmers protest updates

వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం నేడు మరోసారి చర్చలు జరపనుంది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే చట్టాలను రద్దు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం తమకు సమ్మతం కాదంటున్నారు రైతు ప్రతినిధులు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

center to have another round of talks with farmers
నేడు రైతులతో కేంద్రం మరో దఫా చర్చలు

By

Published : Dec 5, 2020, 5:09 AM IST

నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం నేడు మరోసారి చర్చలు జరపనుంది. కేంద్రం ఇప్పటికే రెండు విడతల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. సాగు చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను రైతులు తిరస్కరించారు. చట్టాలు రైతు వ్యతిరేకమని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని గత సమావేశాల్లో డిమాండ్‌ చేశారు. కేంద్రప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఇవాళ జరిగే సమావేశంలోనైనా ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని అన్నదాతలు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 8న భారత్ బంద్‌ నిర్వహించాలని రైతునాయకులు నిర్ణయించారు. ఆ రోజు దిల్లీని ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి రాకపోకలను నిలిపివేస్తామని హెచ్చరించారు. శనివారం ప్రధాని దిష్టి బొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. ఇవాళ రైతులకు మద్దతుగా పంజాబ్‌, హరియాణాకు చెందిన పలువురు క్రీడాకారులు పతకాలను వాపాసు చేస్తామని తెలిపారు.

వెనక్కి తగ్గని రైతన్న..

కేంద్ర వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన తొమ్మిదో రోజూ ఉద్ధృతంగా సాగింది. ఉద్యమానికి మద్దతుగా దిల్లీ సరిహద్దులకు వివిధ ప్రాంతాల రైతులు భారీగా తరలివస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లో ఆందోళన తీవ్రతరమవుతోంది. రైతులు 9వ నెంబర్‌ జాతీయరహదారిని దిగ్బంధించారు. ఉద్యమ కేంద్రాలుగా ఉన్న హరియాణా సరిహద్దుల్లోని సింఘు, టిక్రి వద్ద పెద్ద సంఖ్యలో రైతులు భైటాయించారు. కన్నాట్‌ ప్లేస్ నుంచి జంతర్‌ మంతర్‌ దిశగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సమాఖ్య, ఇతర ప్రజాసంఘాలు చేపట్టిన ప్రదర్శనను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైతు నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎవరిని సంప్రదించకుండా కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ పార్టీ ఎంపీ డిరెక్ ఓబ్రెయిన్..ఆందోళనలు జరుగుతున్న సింఘు వెళ్లి రైతులకు మద్దతు తెలిపారు.

ఇదీ చూడండి: 'కొవిడ్ టీకాకు భారత్ అతిపెద్ద కొనుగోలుదారు'

ABOUT THE AUTHOR

...view details