దేశంలో క్రమంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం సహా నివారణ దిశగా కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల సమన్వయంతో ముందజాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో వైరస్ బారిన పడిన వేలాది మందికి చికిత్స అందించేందుకు ఆయా ప్రభుత్వాలు సతమతమవుతుండగా.. ఎలాంటి విపత్తునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కరోనాకు చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రులు, ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆరోగ్యం నిలకడగా ఉన్న రోగులను ఐసొలేషన్ నుంచి సాధారణ వార్డుకు మార్చేలా కొన్ని ప్రభుత్వ, ఆస్పత్రుల్లో బెడ్‌లను రిజర్వులో ఉంచుకోవాలని సూచించింది.
సర్వం సిద్ధంగా ఉంచుకోండి...
రాష్ట్రప్రభుత్వాలు వేలాది కేసులు బయటపడినప్పటికీ... చికిత్స అందించేందుకు అన్నిరకాలుగా సమాయత్తమయ్యాయి. ఇందుకు అవసరమైన వెంటిలేటర్లు, ఔషధాలు, ఇతర పరికరాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పెద్ద ఆస్పత్రులు, ప్రైవేటు వైద్యవిద్య కళాశాలలు కూడా భారీగా వెంటిలేటర్లు, మాస్క్‌లు, ఇతర సామగ్రిని సిద్ధంగా పెట్టుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. సైన్యం కూడా కోవిడ్-19కు చికిత్స కోసం 28 సర్వీసు ఆస్పత్రులను, పరీక్షల కోసం ఐదు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. పెద్దఎత్తున వెంటిలేటర్ల తయారీ బాధ్యతను కేంద్రం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు అప్పగించింది.