తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఔషధాల ధరలు త్వరలో 80% తగ్గే అవకాశం

దేశవ్యాప్తంగా మందుల ధరలు గణనీయంగా దిగిరానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధాల్లో దాదాపు 80 శాతం ఔషధాల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు షెడ్యూలు జాబితాలో (నాన్‌-షెడ్యూల్డ్‌) లేని ఔషధాలపై 30 శాతం లాభాలతో సరిపెట్టుకుంటామని ఔషధ పరిశ్రమ తయారీదార్లు, పంపిణీదార్లు అంగీకారానికి రావటం ఇందుకు వీలుకల్పిస్తోంది.

Center plans to curb drug prices
మందుల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం యోచన..!

By

Published : Nov 29, 2019, 6:25 AM IST

Updated : Nov 29, 2019, 9:06 AM IST

సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తికి తీవ్రమైన జబ్బుచేస్తే అతని కుటుంబంపై పడే ఆర్థిక భారం అంతాఇంతా కాదు. వైద్యులకు, వైద్య పరీక్షలకు, మందులకు వేలకు వేలు వెచ్చించాల్సి వస్తుంది. ఎన్నో సందర్భాల్లో చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చులో మందుల ఖర్చే ఎక్కువ. అందుకే మనదేశంలో జబ్బుచేసిన మనిషి కోలుకునే సరికి అతని జేబు బక్కచిక్కిపోతోంది.

అందువల్ల మందుల ధరలకు కళ్లెం వేయాలని ఎంతోకాలంగా వివిధ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఎట్టకేలకు ఇది కార్యరూపం దాల్చబోతోంది. దాదాపు గత ఆరు నెలలుగా దీనిపై ఎన్‌పీపీఏ (నేషనల్‌ ఫార్మా ప్రైసింగ్‌ అథారిటీ), ఫార్మాసూటికల్స్‌ శాఖ, నీతి ఆయోగ్‌ చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది.

గత వారంలో దిల్లీలో ఎన్‌పీపీఏ సమక్షంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తయారీదార్లు, పంపిణీదార్లు లాభాలు తగ్గించుకోవటానికి ఒప్పుకున్నారు. ఇది ఎంతో కీలకమైన పరిణామం. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేస్తే మందుల ధరల తగ్గింపు అమల్లోకి వస్తుంది.

ఎంతో అధిక లాభాలు...

కొన్ని మందులపై ప్రస్తుతం నూరు శాతం లాభాలను కంపెనీలు, పంపిణీదార్లు ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షెడ్యూల్డు జాబితాలో ఉన్న ఔషధాలపై ధరల నియంత్రణ ఉంది. ఎన్‌పీపీఏ ఈ ఔషధాల ధరను నిర్ణయిస్తుంది. కానీ నాన్‌-షెడ్యూల్డు ధరల విషయంలో ఇటువంటి నియంత్రణ లేదు. పైగా ఏటా 10 శాతం వరకూ ఇటువంటి మందుల ధరలను పెంచుకునే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వ ఫార్మాసూటికల్స్‌ శాఖ లెక్కల ప్రకారం నాన్‌-షెడ్యూల్డు ఔషధాల సంఖ్య 10,600 కంటే పైగానే ఉంటుంది. విటమిన్‌-డి వంటి సాధారణ మందుల నుంచి ఎన్నో యాంటీ- బయాటిక్స్‌ ఔషధాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిల్లో హోల్‌సేల్‌ స్టాకిస్టులకు 10 శాతం, రిటైలర్లకు 20 శాతం కనీసం మిగులు ఉండే విధంగా ఔషధ కంపెనీలు ధరలు నిర్ణయిస్తాయని చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఎన్నో మందులకు అధిక ధరలు ఉంటున్నాయనేది ప్రధానమైన ఆరోపణ. అదే ప్రజలకు పెనుభారం అవుతోంది.

కేన్సర్‌ ఔషధాల మోడల్‌...

కేన్సర్‌, గుండెజబ్బులు, ఇంకా ఇతర ప్రాణాంతకమైన వ్యాధులకు చికిత్సలో వినియోగించే ఔషధాల నుంచి సాధారణ ఔషధాల వరకూ ఇష్టానుసారం ధరలు వసూలు చేస్తున్నారని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎంతో కాలంగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. ముఖ్యంగా కేన్సర్‌ వ్యాధి పీడితులు, వారి తరఫున పనిచేస్తున్న వారు కేంద్ర ప్రభుత్వానికి కేన్సర్‌ మందుల ధరల భారం భరించలేనిదిగా ఉన్నట్లు చెబుతూ వచ్చారు. దీనిపై కసరత్తు చేసి కేన్సర్‌ ఔషధాలపై 30 శాతానికి మించి లాభాలు వసూలు చేయకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో కేన్సర్‌ ఔషధాల ధరలు బాగా తగ్గాయి. గత కొంతకాలంగా ఇది అమలవుతోంది.

30 శాతానికి అంగీకారం....

తదుపరి నాన్‌-షెడ్యూల్డు ఔషధాలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. దీనిపై ఐడీఎంఏ (ఇండియన్‌ డ్రగ్‌ మానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌), ఐపీఏ (ఇండియన్‌ ఫార్మాసూటికల్‌ అలియన్స్‌), ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ప్రోడ్యూసర్స్‌ ఆఫ్‌ ఇండియా వంటి సంస్థలతో ఎన్‌పీపీఏ సంప్రదింపులు చేపట్టింది. లాభాలను 30 శాతానికి పరిమితం చేయటానికి ఈ సంస్థలు అంగీకరించాయి.

అఖిల భారత కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోషియేషన్‌ మాత్రం హోల్‌సేల్‌ స్టాకిస్టులకు 12.5 శాతం, రిటైల్‌ పంపిణీదార్లకు 25 శాతం మిగులు ఉండాలని కోరినట్లు చెబుతున్నారు. మొత్తం మీద చివరికి 30 శాతం లాభాల పరిమితి విధించటానికి తుది నిర్ణయం జరిగింది. అందువల్ల త్వరలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ‘నిజామాబాద్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ’ వ్యవస్థాపక అధ్యక్షుడైన పీఆర్‌ సోమానీ ‘ఈనాడు’కు తెలిపారు.

రంగుల్లో వ్యత్యాసం ఉండాలి....

మనదేశంలో మందుల్లో జనరిక్స్‌, బ్రాండెడ్‌ జనరిక్స్‌... అని రెండు తరగతులు ఉన్నాయి. రెండు ఔషధాలు ఒకటే. కానీ ఒక దానికి బ్రాండు పేరు ఉంటుంది. జనరిక్స్‌ ఔషధాలపై ఆ మందు సాంకేతిక నామం ఉంటుంది. బ్రాండెడ్‌ ఔషధాల్లో కంపెనీలకు లాభాలు ఎక్కువ. జనరిక్‌ ఔషధాల్లో మాత్రం రిటైల్‌ విక్రయదార్లు అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని వర్గాలు సూచించాయి.

అంతేకాకుండా బ్రాండెడ్‌ ఔషధాలకు ప్యాక్‌కు ఒక రంగు, జనరిక్‌ ఔషధాల ప్యాక్‌కు మరో రంగు వినియోగించాలని, తద్వారా వినియోగదార్లు రెండింటి మధ్య వ్యత్యాసాన్ని వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని పీఆర్‌ సోమానీ వివరించారు. డాక్టర్లు కూడా తమ ప్రిస్క్రిప్షన్లలో ఔషధాల జనరిక్‌ పేర్లు మాత్రమే రాయాలని నిర్దేశించాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్పినట్లు వెల్లడించారు. తద్వారా జనరిక్‌ ఔషధాల వినియోగం పెరిగి ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

80 శాతం మందుల ధరలు దిగివచ్చే అవకాశం
Last Updated : Nov 29, 2019, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details