కరోనా నియంత్రణకు ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జిల్లాలను కరోనా కేసుల ప్రాతిపదికన.. హాట్‌స్పాట్, హాట్‌స్పాట్ యేతర, గ్రీన్‌జోన్ అనే మూడు విభాగాలుగా విభజిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హెల్త్ సెక్రటరీలు, డీజీపీలతో కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపిన ఆయన.. కొవిడ్-19 హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వివరించారు.
" దేశవ్యాప్తంగా మొత్తం 170 హాట్స్పాట్లు, 207 హాట్‌స్పాట్ యేతర ప్రాంతాలను గుర్తించాం. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నాం. నిర్బంధ జోన్లలో అత్యవసరమైన వారికి మినహా ఎలాంటి రాకపోకలకు అనుమతి ఉండదు. కొత్త కరోనా కేసుల కోసం ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తుంది. శాంపిల్స్ సేకరించి నమూనా ప్రమాణాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తుంది. భారత్‌లో ప్రస్తుతం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు."