కరోనా నియంత్రణే లక్ష్యంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు కొనసాగించడానికి సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఏప్రిల్ 20 నుంచి కొన్ని నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ, మరికొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాటి ప్రకారం...
మే 3 వరకు...
- అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల మధ్య ప్రజా రవాణా నిషేధం అమల్లో ఉంటుంది.
- మెట్రో, బస్సు సర్వీసులపైనా ఆంక్షలు కొనసాగుతాయి.
- సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, ఈత కొలనులు, బార్లు మూసే ఉంచాలి.
- విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు, రైళ్లు బంద్.
- బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా.
- అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగింపు.
- హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నిత్యావసరాలు మినహా అన్ని రకాల రవాణాలపై నిషేధం.
- నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
ఆరోగ్య విభాగం...
- ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్లీనిక్స్, టెలిమెడికల్ సదుపాయలు అందుబాటులో ఉంటాయి.
- డిస్పెన్సరీలు, మందుల దుకాణాలు తెరిచే ఉంటాయి.
- మెడికల్ ల్యాబొరేటరీలు, రీసర్చ్ ల్యాబ్‌లు ఉంటాయి.
- మందులు, వైద్య పరికరాల తయారీ విభాగాలు తెరిచే ఉంటాయి.
వ్యవసాయం...
అన్ని రకాల వ్యవసాయ, ఉద్యానవన కార్యకలాపాలు సాగుతాయి. అవి...
- రైతులు చేపట్టే వ్యవసాయ కార్యకలాపాలు.
- వ్యవసాయ ఉత్పత్తులతో సంబంధం ఉండే సంస్థలు.
- వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే మండీలు.