దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ రూపొందించిన 'కొవాగ్జిన్' టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన ఆమోదం తెలపాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ-డీసీజీఐకి సిఫారసు చేసింది. ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతికి సిఫారసులు చేసిన 24 గంటల్లోపే కొవాగ్జిన్‌కు అనుమతివ్వాలని నిపుణుల కమిటీ భావించింది. కొవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేయగా.. భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది.
కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి - భారత్ బయోటెక్ టీకాకు అనుమతి
18:33 January 02
కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి
కొవాగ్జిన్ పూర్తిగా దేశీయంగా రూపొందిన కొవిడ్ టీకా. భారత వైద్య పరిశోధనా మండలి-ఐసీఎంఆర్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-ఎన్ఐవీల భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేసింది. సీడీఎస్‌సీఓ నిపుణుల కమిటీ చేసిన సిఫారసును డీసీజీఐ అనుమతించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొవాగ్జిన్ టీకా పంపిణీని ప్రారంభించనుంది.
డిసెంబర్ 9, డిసెంబరు 30న సీడీఎస్‌సీఓ నిపుణుల కమిటీ.. భారత్ బయోటెక్‌ను టీకాపై అదనపు సమాచారం కోరింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సహా భారత్ బయోటెక్ సమర్పించిన అదనపు సమాచారాన్ని క్రోడీకరించి సుధీర్ఘంగా విశ్లేషించిన నిపుణుల కమిటీ షరతులతో కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
జైడస్ క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ కు మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ నిర్వహించడానికి అనుమతించాలని కూడా నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.