కొవిడ్-19 నిర్మూలనకు రూపొందిన భారత తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. కరోనా వైరస్ రూపాంతరం చెంది, కొత్త రకాలు విజృంభిస్తున్న తరుణంలో ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. క్లినికల్ ట్రయల్ విధానంలో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని సూచించింది. కొవాగ్జిన్‌కు డీసీజీఐ తుది అనుమతి రావడమే మిగిలి ఉంది. అది లాంఛనప్రాయమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టీకా ఉత్పత్తి, పంపిణీ అంశాలపై భారత్ బయోటెక్ దృష్టి సారించనుంది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)లోని నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశమై కొవిడ్-19 టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే అంశంపై చర్చించింది.
యథావిథిగానేమూడోదశ క్లినికల్ ట్రయల్స్
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతిని సిఫార్సు చేయాలని ఇప్పటికే సూచించింది సీడీఎస్‌సీఓ. శనివారం మరోసారి సమావేశమైన నిపుణుల కమిటీ.. భారత్ బయోటెక్ దరఖాస్తును, ఆ సంస్థ సమర్పించిన అదనపు డేటా, వాస్తవాలు, విశ్లేషణ వివరాలను పరిశీలించింది. కరోనా వైరస్‌లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రజాప్రయోజనాల మేరకు అత్యవసర పరిస్థితుల్లో ముందుజాగ్రత్తగా క్లినికల్ ప్రయోగాల విధానంలో ఉపయోగించడానికి అనుమతినివ్వాలని డీసీజీఐకి సిఫార్సు చేసింది. అయితే.. కొవాగ్జిన్‌పై మూడో దశ క్లినికల్ ప్రయోగాలను కొనసాగించాలని భారత్ బయోటెక్‌కు నిపుణుల కమిటీ సూచించింది. ఆ డేటాను ఎప్పటికప్పుడు సమర్పించాలని నిర్దేశించింది.
అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ కూడా అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దీనిపై నిపుణుల కమిటీ పరిశీలన చేపట్టలేదు. క్యాడిలా హెల్త్‌కేర్ అభివృద్ధి చేస్తున్న మరో టీకాకు మూడో దశ క్లినికల్ ప్రయోగాలకు అనుమతినివ్వాలని సూచించింది.కమిటీ తాజా నిర్ణయంతో కొద్ది రోజుల్లో రెండు టీకాల విడుదలకు మార్గం సుగమమవుతుంది. మరో రెండు టీకాల అభివృద్ధి తుది దశలో ఉంది.
టీకాను ఎలా అభివృద్ధి చేశారంటే?
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అందించిన సార్స్-కోవ్-2 వైరస్ స్ట్రెయిన్‌తో భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్.. ఇన్‌యాక్టివేటెడ్ రకానికి చెందిన టీకా. వ్యాధికారక సూక్ష్మజీవిని నిర్వీర్యం చేయడం ద్వారా వీటిని తయారుచేస్తారు. ఫలితంగా ఈ జీవికి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు. అయితే టీకా తీసుకున్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ గుర్తించగలిగి, వాటిపై ప్రతిస్పందన చర్యలను కలిగించే స్థాయిలో అది ఉంటుంది. హెపటైటిస్-ఎ, ఇన్‌ఫ్లూయెంజా, పోలియో, రేబీస్ వంటి అనేక వ్యాధులకు ఇన్‌యాక్టివేటెడ్ టీకాలనే ఇస్తున్నారు.
అన్ని పరీక్షలు పూర్తయ్యాయా?