పాఠశాలలను అనుబంధ సంస్థలుగా గుర్తించే సమయంలో పూర్తిగా డిజిటలీకరణ మార్గాన్ని అనుసరించాలని కేంద్ర మాధ్యమిక విద్యా సంస్థ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. గుర్తింపు మంజూరులో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా చూడనుంది. సమర్పించిన సమాచారాన్ని కంప్యూటర్లే విశ్లేషించి గుర్తింపును ఇస్తాయి. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
మానవ ప్రమేయం లేకుండా సీబీఎస్‌ఈ గుర్తింపు
కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానంతో అనుబంధ గుర్తింపు వ్యవస్థలో కీలక మార్పులకు తెర తీసింది సీబీఎస్‌ఈ. పూర్తి స్థాయిలో డిజిటలీకరణ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించింది.
జాతీయ విద్యా విధానంలో భాగంగా దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి చెప్పారు. ఆన్‌లైన్ విధానం 2006 నుంచే అమల్లో ఉందని తెలిపారు. అయితే పత్రాల పరిశీలన, విశ్లేషణ వంటివి కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని వివరించారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. కొత్తగా గుర్తింపు కోసం మార్చి 1 నుంచి 31, జూన్ 1 నుంచి 30, సెప్టెంబరు 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. గుర్తింపు పొడిగింపు కోసం మార్చి 1 నుంచి 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు