తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అస్థానాకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి' - రాకేశ్​ అస్థానా

లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న.. సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్​ రాకేశ్​ అస్థానా కేసులో స్పష్టమైన ఆధారాలున్నాయని గతంలో ఈ కేసును దర్యాప్తు చేసిన విచారణాధికారి అజయ్​ కుమార్​ బస్సీ ఆరోపించారు. దిల్లీ కోర్టులో వాదనల సందర్భంగా శుక్రవారం ఇలా వ్యాఖ్యానించారు. ఇటీవల అస్థానాకు సీబీఐ క్లీన్​చిట్​ ఇచ్చిన నేపథ్యంలో బస్సీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

CBI vs CBI: There was clinching evidence against Asthana, ex-IO tells court
'అస్థానాకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి'

By

Published : Feb 29, 2020, 5:46 AM IST

Updated : Mar 2, 2020, 10:26 PM IST

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్​ అస్థానా లంచం తీసుకున్నారన్న కేసులో స్పష్టమైన ఆధారాలు ఉండేవని ఈ కేసును గతంలో దర్యాప్తు చేసిన అజయ్‌ కుమార్‌ బస్సీ ఆరోపించారు. ఈ మేరకు తన వాదనను దిల్లీ కోర్టు ముందు శుక్రవారం వినిపించారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుపుతున్న సతీష్‌ దగర్‌.. అస్థానా సహా ఈ అంశంతో సంబంధమున్న ఇతర అధికారులను కాపాడేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో న్యాయమూర్తి సంజీవ్‌ అగర్వాల్‌ కలుగజేసుకొని ఇరువురిని వారించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఈ కేసులో రాకేష్‌ అస్థానాకు సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన తరుణంలో అజయ్‌ కుమార్‌ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సీబీఐ తీరుపై ఆగ్రహం...

రాకేశ్​ అస్థానాపై సీబీఐ జరిపిన విచారణ తీరుపై ఫిబ్రవరి 12న కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులు యథేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించింది. సరైన ఆధారాలు లేవన్న కారణంతో అస్థానా సహా మరికొంత మంది అధికారులకు పేర్లను అభియోగపత్రంలో 12వ కాలమ్‌లో సీబీఐ చేర్చింది.

2017లో మాంసం ఎగుమతి వ్యాపారవేత్త మొయిన్‌ ఖురేషిపై మనీలాండరింగ్, అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు రాగా ఆయనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై రాకేశ్​ అస్థానా నేతృత్వంలో ప్రత్యేక బృందం (సిట్) ఏర్పాటైంది. ఈ కేసు నుంచి తనను తప్పించేందుకు మనోజ్‌ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్​కు రెండు కోట్లు ఇచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన సానా సతీష్ అనే వ్యాపారవేత్త ఆరోపించారు.

మనోజ్​ మినహా అందరికీ క్లీన్​చిట్​...

రాకేశ్​ అస్థానాతో తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించి సీబీఐ విచారణ నుంచి తప్పిస్తామని వారు హామీ ఇచ్చారని అప్పట్లో సతీష్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన విచారణలో కూడా వెల్లడించారు. దీంతో సతీష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాకేష్‌ అస్థానాపై నాటి సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి మనోజ్‌ ప్రసాద్‌ను అక్టోబరు 17, 2018న అరెస్టు చేశారు. అదే ఏడాది డిసెంబరు 18న ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. దీనిపై 60 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైంది. అంతే కాకుండా ఇదే కేసులో సీబీఐ సిట్‌ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌ను కూడా అక్టోబరు 23, 2019న అరెస్టు చేయగా ఆయన వారం తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఒక్క మనోజ్‌ ప్రసాద్ మినహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చింది.

Last Updated : Mar 2, 2020, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details