దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ హత్యాచార కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). విచారణలో భాగంగా ఘటన జరిగిన ప్రదేశానికి అధికారుల బృందం చేరుకుంది. బాధితురాలి సోదరుడ్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు అధికారులు.
సీబీఐ విచారణ నేపథ్యంలో బాధితురాలి గ్రామంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. భారీగా పోలీసులను మోహరించింది.
మరోవైపు ఈ కేసు విచారణ కోసం అలహాబాద్ హైకోర్టు ఎదుట హాజరైన బాధితురాలి కుటుంబసభ్యులు తిరిగి స్వగ్రామం చేరుకున్నారు. బాధితురాలి తల్లి అస్వస్థకు గురైన కారణంగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. తండ్రి కూడా అనారోగ్యానికి గురైనప్పటికీ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో హాథ్రస్ ముఖ్య వైద్యాధికారి బాధితురాలి ఇంటికి వచ్చి వైద్యం చేశారు.
సెప్టెంబరు 14న ఓ దళిత యువతిపై సాముహిక అత్యాచారం జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆమె దిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న మరణించింది. యూపీ పోలీసులు ఆమె మృతదేహానికి రాత్రికి రాత్రే దహన సంస్కరాలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.