కోల్‌కతా మాజీ సీపీ రాజీవ్‌కు సీబీఐ నోటీసులు శారదా కుంభకోణం విచారణ కేసులో కోల్‌కతా మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ రోజు రాజీవ్‌కుమార్‌పై లుక్అవుట్ నోటీసులిచ్చిన సీబీఐ తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది. సోమవారం కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయం ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
శారదా కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించమని రాజీవ్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన ఒక్కరోజులోనే ఈ నోటీసులు జారీకావడం గమనార్హం.
లుక్అవుట్ నోటీసు..
ఇవాళ ఉదయం లుక్అవుట్ నోటీసు జారీచేసిన సీబీఐ...రాజీవ్‌కుమార్ దేశం విడిచి పారిపోకుండా విమానాశ్రయాలు, నౌకాశ్రయాల వద్ద భద్రత పటిష్ఠం చేసింది. రాజీవ్‌కుమార్ విచారణకు సహకరించడం లేదని, అతణ్ని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతామని సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. సరిపడా ఆధారాలు సమర్పిస్తే పరిశీలిస్తామని సీబీఐకి సూచించింది అత్యున్నత న్యాయస్థానం.
శారదా (పోంజీ) కుంభకోణం కేసు విషయంలో గతంలో రాజీవ్‌కుమార్‌కు అరెస్టు నుంచి ఊరట కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. దానిని పొడిగించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే రాజీవ్‌కుమార్ విజ్ఞప్తిని శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఇదీ చూడండి: మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్