ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచారు సీబీఐ అధికారులు. పటిష్ఠ భద్రత నడుమ ఆయన్ను దిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. చిదంబరం రిమాండ్ ప్రతిని న్యాయమూర్తికి సమర్పించిన సొలిసిటర్ జనరల్ తుషారు మెహతా.. సీబీఐ తరఫున వాదనలు వినిపించారు.
"అరెస్టు చేసిన 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టాం. 2 గంటల్లో హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇస్తే చిదంబరం నుంచి స్పందన రాలేదు. ఈ అంశంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులూ ఉన్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటివరకూ ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు 5 రోజుల పాటు చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇవ్వాలి. "
-తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్
చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఆర్థిక మంత్రిగా విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ)కు సంబంధించిన విషయంలో చిదంబరం ఒక్కరే నిర్ణయం తీసుకోలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.