తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వజ్రాల వ్యాపారి జతిన్​పై మరో రెండు సీబీఐ కేసులు - 'బాంబే డైమండ్స్​ కంపెనీ ప్రైవేట్​ లిమిటెడ్​'

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి జతిన్​ మెహతాపై కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా రెండు కేసులు నమోదుచేసింది. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన ఈ నిందితుడిపై ఇప్పటికే 7 కేసులు ఉన్నాయి.

వజ్రాల వ్యాపారి జతిన్​పై సీబీఐ మరో రెండు కేసులు

By

Published : Jun 12, 2019, 6:39 AM IST

Updated : Jun 12, 2019, 7:43 AM IST

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి జతిన్ మెహతాపై... తాజాగా సీబీఐ మరో రెండు కేసులు నమోదు చేసింది. బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర, యూనియన్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియాకు సుమారు రూ.587.55 కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులో నిందితునిగా ఉన్న జతిన్​ కోసం సీబీఐ గాలిస్తోంది.

బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్ర నుంచి సుమారు రూ.323.40 కోట్లు, యూనియన్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా నుంచి సుమారు రూ.264.15 కోట్లు రుణాలు పొంది, తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డాడని అతనిపై అభియోగం. ఈ రెండు బ్యాంకులు ఈ మేరకు ఫిర్యాదు చేయడం వల్ల జతిన్​పై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది.

జతిన్​ మెహతాతోపాటు బాంబే డైమండ్స్​ కంపెనీ ప్రైవేట్​ లిమిటెడ్​' డైరెక్టర్లు రమేష్​ ఐ ప్రకాశ్, రవిచంద్రన్​ రామస్వామి, హరీష్​ రతిలాల్​ మెహతా, జోర్డాన్ దేశానికి చెందిన హతియమ్​ సల్మాన్​ అలీ అబూ ఒబైదా పైనా సీబీఐ కేసులు నమోదు చేసింది.

14 బ్యాంకులకు కన్సార్షియమ్​గా ఉన్న ఈ రెండు బ్యాంకులు... జతిన్ వజ్రాల కంపెనీకి సుమారు రూ.4,600 కోట్ల రుణ సౌకర్యాలను కల్పించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ ముంబయి, అహ్మదాబాద్​, కోయంబత్తూరులో జతిన్​కు సంబంధించిన స్థలాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.

ముందే పారిపోయాడు..

జతిన్​ మెహతా తన వజ్రాల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్​ పదవి నుంచి 2011 ఏప్రిల్ నెలలోనే వైదొలిగాడు. అప్పటి నుంచి నాన్​ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా కొనసాగుతున్నాడు. బ్యాంకులు రుణాల ఎగవేత కేసును పెట్టక మునుపే జతిన్ దేశం విడిచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతను కరీబియన్ దీవుల్లో ఉన్నట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో జతిన్​పై సీబీఐ ఇప్పటికే 7 కేసులు నమోదు చేసింది. తాజాగా మరో రెండు కేసులు బనాయించింది.

ఇదీ చూడండి: 'ఏఎన్​-32 ప్రయాణికుల కోసం ముమ్మర గాలింపు'

Last Updated : Jun 12, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details