బాబ్రీ మసీదును కూల్చివేసి దేశంలో మత కలహాలు రేకెత్తించడానికి పాకిస్థాన్ నిఘా సంస్థ కూడా ప్రయత్నించవచ్చనే రహస్య సమాచారం ముందుగానే అందినా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆ అంశంపై దర్యాప్తు చేయలేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారన్న 32 మంది ప్రముఖులు నిర్దోషులని ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎస్.కె.యాదవ్ బుధవారం తీర్పు వెలువరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సీబీఐ తగిన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడంతో పాటు పాక్ కోణాన్ని విస్మరించిందని పేర్కొన్నారు. విచారణ జరిపి, కూల్చివేతలో పాక్ పాత్ర లేదని చెప్పే కీలకాంశాన్ని వదిలేయడం వల్ల కేసు బలహీనపడిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సీబీఐ ఆ కోణాన్ని పరిశీలించి ఉంటే కేసులో నేరపూరిత కుట్ర కోణాన్ని న్యాయవ్యవస్థ సమీక్షించి ఉండేదని చెప్పారు.
పేలుడు పదార్థాలు వస్తున్నాయనే సమాచారమూ ఉంది
"1992 డిసెంబరు 6న పాక్ నిఘా సంస్థకు చెందిన వ్యక్తులు అయోధ్య ప్రజలతో కలిసిపోయి, పేలుడు పదార్థాలతో గానీ ఇతర మార్గాల్లో గానీ వివాదాస్పద కట్టడానికి నష్టం కలిగించవచ్చనే సమాచారం స్థానిక నిఘా విభాగం(ఎల్ఐయూ) నివేదికలో ఉంది. కరసేవకు అంతరాయం కలిగించి, యూపీలో, దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రకు పాల్పడవచ్చని చెప్పే సమచారంపై యూపీ ఐజీ సంతకం చేశారు. పాకిస్థాన్ నుంచి దిల్లీ మీదుగా అయోధ్యకు పేలుడు పదార్థాలు రవాణా అయ్యాయనే నివేదికలూ ఉన్నాయి. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపుర్ నుంచి దాదాపు 100 మంది సంఘ విద్రోహ శక్తులు కరసేవకుల ముసుగులో అయోధ్యకు వస్తున్నట్లు నిఘా నివేదికల్లో ఉంది. దీనిని అన్ని భద్రత సంస్థలకు రాతపూర్వకంగా యూపీ హోంశాఖ పంపించింది. అంతటి కీలక వివరాలున్నా దానిపై దర్యాప్తు మాత్రం జరగనేలేదు" అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అనేకమంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఒకదానికొకటి పొసగడం లేదని తీర్పులో రాశారు.
పాక్ విమర్శల్ని తోలిపుచ్చిన కేంద్రం..