బిహార్ రాజకీయాలు-కుల సమీకరణలు... ఈ రెండింటినీ వేరుగా చూడలేమంటారు విశ్లేషకులు. 2020 బిహార్ శాసనసభ ఎన్నికల వేళ.. మరోసారి కులం అస్త్రాలను బయటకు తీసుకొచ్చాయి అన్ని పార్టీలు. సింహాసనం దక్కాలంటే.. ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవాల్సిందే అన్న ధోరణిలో వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
కులం కార్డే.. గెలుపు కార్డు
ఒకటిన్నర దశాబ్దం కిందట.. అంటే 2005లో భాజపా అండతో నితీశ్ కుమార్ పట్నా గద్దెనెక్కారు. ఇక అప్పటినుంచి కొనసాగుతోంది ఈ విజయ ప్రస్థానం. 2010లో నితీశ్ పార్టీ పొత్తులో భాగంగా 141 స్థానాల్లో పోటీ చేసి.. 115 సీట్లు కైవసం చేసుకుంది. నాడు భాజపా 102 సీట్లలో నిలబడి.. 91స్థానాలు దక్కించుకుంది. అయితే, నితీశ్‌కు భాజపాకు దూరం పెరిగిన ప్రతిసారి మారిన బిహార్ రాజకీయాల్లోకి.. కొత్త శక్తులు దూసుకొచ్చాయి. కొత్త సమీకరణలు పుట్టుకొచ్చాయి.
తరాలు మారినా, పార్టీలు ఏవైనా.. అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్లినా.. సామాజిక వర్గాల సమీకరణలు మాత్రం ఎప్పుడూ దూరం కాలేదు. బిహార్‌ను కాంగ్రెస్ ఏలినంత కాలం.. రాజకీయాల్లో కులం కార్డును అద్భుతంగా వినియోగించుకుంది. దశాబ్దాల పాటు అధికారం అనుభవించింది. అయితే, దిల్లీ అధిష్ఠానం నుంచే అన్ని ఆదేశాలు రావటం వల్ల.. స్థానిక రాజకీయాలపై పెద్దగా దృష్టిసారించలేదు.
ఇక దేశంలో సామాజిక వర్గాల లెక్కలను పూర్తిగా మార్చేసిన మండల్ కమిషన్ తర్వాత.. బిహార్‌లోనూ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం అనంతరం అక్కడ సమీకరణలు పూర్తిగా కొత్తరూపు దాల్చాయి. అదే సమయంలో మండల్ కమిషన్ ద్వారా.. లాలూ ప్రసాద్ యాదవ్ వెలుగులోకి వచ్చారు. ఇక లాలూ మార్కు రాజకీయం.. బిహార్ కుల రాజకీయాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది. కాంగ్రెస్ సైతం ఆయనను అనుసరించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇదీ చూడండి:బిహార్ ఎన్నికల ఫైట్: ఎవరి సత్తా ఎంత..?
లాలూ రూటే సెపరేటు
ఇక లాలూ.. అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా కొత్త రాజకీయాలకు తెరదీశారు. సోషల్ ఇంజినీరింగ్‌లో ఆరితేరిన ఆయన.. సామాజిక వర్గాల ఏకీకరణతో ఓటు బ్యాంకు పెంచుకున్నారు. అందరినీ కలుపుకుపోయే లాలూ.. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ అణగారిన వర్గాలకు అండగా ఉంటానన్న భరోసా కల్పించారు. అందుకు సగటు బిహారీలా కనిపించే ఆయన వేష-భాషలు బాగా తోడ్పడ్డాయి. వేగంగానే అధికార పీఠాన్ని అధిష్ఠించారు.
ఇలా తనదైన మార్కుతో.. సోషల్ ఇంజినీరింగ్ విధానాలతో 1990 నుంచి 2005 వరకు 15 సంవత్సరాల పాటు ఆర్జేడీని అధికారం ఉంచగలిగారు లాలూ ప్రసాద్. మండల్ కమిషన్ ద్వారా ముస్లిం-యాదవ్ సమీరకరణాన్ని సమర్థంగా ఉపయోగించుకుని ఓటు బ్యాంకు సృష్టించుకోగలిగారు. మూడో సారి అధికారంలోకి వచ్చే క్రమంలో రిజర్వేషన్లను సైతం సమ్మోహనాస్త్రంగా వినియోగించుకున్నారు.
అయితే, లాలూ ఎక్కువగా కుల రాజకీయాలనే నమ్ముకోవటం కాస్త బెడిసికొట్టింది. ఈ తరుణంలో రాష్ట్రాభివృద్ధి పేరుతో బరిలోకి దిగిన నితీశ్ కుమార్.. లాలూకు షాక్ ఇచ్చారు. భాజపాతో కలిసి 2005లో అధికారం దక్కించుకున్నారు. అయితే, పరిస్థితికి అనుగుణంగా వ్యూహం మార్చిన లాలూ.. రాం విలాస్ పాసవాన్‌తో జట్టుకట్టి 2009 లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటారు.
ఇదీ చూడండి:బిహార్‌లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
నిలబడిన నితీశ్
నితీశ్ కుమార్, అధికారంలోకి వచ్చాక మెల్లిగా సామాజిక వర్గాల తేనె తెట్టెను కదిలించటం మొదలుపెట్టారు. బిహార్‌లో దళితులను.. వెనుకబడిన వర్గాల నుంచి బయటకు తీసుకొచ్చి అత్యంత వెనుకబడిన వర్గం.. ఎంబీసీగా చేశారు. ఈ మహాదళిత్ సామాజిక వర్గంలోకి 21 ఉపకులాల దళితులను చేర్చారు. ఈ నేపథ్యంలో మహాదళిత్‌గా ఉన్న రాం విలాస్ పాసవాన్.. సొంతంగా ప్రజల్లో ఆదరణ కూడగట్టుకోవటం ఆరంభించారు.
ఈ మహాదళిత్ కేటగిరీని నితీశ్ కుమార్ వేసిన గొప్ప ఎత్తుగా అభివర్ణిస్తారు విశ్లేషకులు. ఎందుకంటే భాజపాతో జట్టు కట్టినంత కాలం.. యాదవులు-ముస్లిం ఓట్లు పడవని నితీశ్‌కు తెలుసు. కానీ, బిహార్ గద్దెనెక్కాలంటే ఈ ఓట్లు కీలకం. ఈ నేపథ్యంలోనే మహాదళిత్ వర్గంతో ఓట్లు కొల్లగొట్టాలని భావించి... 2010లో సఫలీకృతం అయ్యారు. నితీశ్ సారథ్యంలో జేడీయూ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది.