అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు విచ్చేశారు. 'నమస్తే ట్రంప్' కార్యక్రమం కోసం భారత ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే, అమెరికా అధ్యక్షులకు ఇంత ఘనమైన ఆతిథ్యమివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. దాదాపు అర్ధశతాబ్దం క్రితం భారత్‌కు విచ్చేసిన అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నుంచి బరాక్ ఒబామా వరకు ఇదే తరహాలో స్వాగతం లభించింది. అంతే కాదు, హరియాణాలో కార్టర్ సందర్శించిన ఓ గ్రామం పేరు ఏకంగా 'కార్టర్పురి'గా మారిపోయింది.
కార్టర్‌ను మెప్పించేలా..
1978 జనవరి 3న అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీసమేతంగా భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో హరియాణాలోని దౌలత్‌పూర్ నసీరాబాద్ గ్రామాన్ని తిలకించాలని ఆయన ముచ్చటపడ్డారు. ఆయన కోరిక మేరకు అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ దగ్గరుండి జిమ్మీ కార్టర్ దంపతులను దౌలత్‌పూర్ నసీరాబాద్ గ్రామానికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ గ్రామస్థులు జిమ్మీకి చేసిన మర్యాదలు ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటారు వారంతా.
"జిమ్మీ కార్టర్ రాబోతున్నారని తెలిసినప్పుడు.. నెల రోజుల ముందు నుంచే మా గ్రామంలో పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టాం. ఎంతలా అంటే.. ఆవు పేడతో చేసిన పిడకలకు కూడా రంగులు పూసి అందంగా మలిచాం. నలుదిక్కులను తళతళ మెరిపించాం. ఆ రోజు జిమ్మీ కార్టర్, ఆయన భార్య రోజ్లిన్ కార్టర్‌ను నవ దంపతులకు స్వాగతం పలికినట్టుగా ఘన స్వాగతం పలికారు మా గ్రామ మహిళలు."
-అతర్ సింగ్, గ్రామస్థుడు
ఆ ఊరికే ఎందుకు?
జిమ్మీ కార్టర్ తల్లి లిలియోన్ కార్టర్ ఓ నర్స్.. అంతకు మించి గొప్ప సామాజిక కార్యకర్త. స్వాతంత్ర్యానికి ముందు దౌలత్‌పుర్‌లో చాలా కాలం పనిచేశారామె. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ గ్రామ జమీందారు ఇంట్లోనే నివాసమున్నారు. తల్లి నడయాడిన గ్రామం కాబట్టి ఆ ఊరిపై అంత మమకారం పెంచుకున్నారు కార్టర్. అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో దాదాపు 45 నిమిషాల పాటు ఆ ఊరంతా తిరిగారు. ఓ ఇంట్లోకి వెళ్లి.. సజ్జ రొట్టేలు ఆరగించారు.