కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్యపై 23 మంది నాయకులు లేఖ రాసిన నేపథ్యంలో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధినేతను మార్చాల్సిన తొందరేమీ లేదని పేర్కొన్నారు. ఆకాశం ఊడిపడుతుందనే పరిస్థితులేవీ కనిపించడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం పార్టీ చీఫ్‌గా ఉన్న నేపథ్యంలో నాయకత్వ సమస్యపైనా సోనియా గాంధీనే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
లేఖలో సంతకం పెట్టేందుకు ఎవరూ తనను సంప్రదించలేదని.. ఒకవేళ సంప్రదించినా సంతకం పెట్టేవాడిని కాదని తేల్చిచెప్పారు ఖుర్షీద్. లేఖ రాసిన బృందంలో కీలకంగా వ్యవహరిస్తున్న గులామ్ నబీ ఆజాద్‌పై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.
"జమ్ము కశ్మీర్‌కు చెందిన నేత(గులామ్ నబీ ఆజాద్‌ను ఉద్దేశించి) హోదా పరంగా పార్టీలో అగ్రస్థానంలో ఉన్నారు. సంవత్సరాల తరబడి ఎలాంటి అంతర్గత ఎన్నికలు లేకపోయినా పార్టీ వృద్ధి చెందింది. ఆయన దీన్ని మార్చాలని అనుకుంటున్నారు. ఓ సీనియర్ నేతగా ఆయన వ్యక్తం చేసిన ఆలోచనలకు పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుంది."