ఝార్ఖండ్ అసెంబ్లీ తుదివిడత ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరిదైన ఐదో విడతలో భాగంగా 16 నియోజకవర్గాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు 6 జిల్లాల్లో 40,000 భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
20న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. భద్రత కారణాల దృష్ట్యా బోరియో, బర్హైత్, లితిపారా, మహేశ్పుర్, సికారిపారా నియోజకవర్గాల్లో సాయంత్రం 3 గంటలకే పోలింగ్ ముగియనున్నట్లు అధికారులు తెలిపారు.
పోటీలో ప్రముఖులు
ఐదో విడతలో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులతో పాటు, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు సోరెన్. అయితే డుంకా నియోజకవర్గంలో ఆ రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, లూయిస్ మరండి(భాజపా) నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సరథ్ నుంచి ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి రాంధిర్ సింగ్ పోటీలో ఉన్నారు.