సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్.. మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఐదో దశలో భాగంగా 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. 674 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 8 కోట్ల 75 లక్షల మంది ప్రజలు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ 4 గంటల వరకే నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. పౌరులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బూత్‌ల ముందు బారులుతీరారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌లో 12, పశ్చిమ్ బంగ, మధ్యప్రదేశ్‌లలో 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 4, జమ్ములో 2 లోక్‌సభ స్థానాలకు ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. రాజస్థాన్‌లో ఈ విడతతో ఎన్నికలు ముగియనున్నాయి.
ఐదో విడతలోనూ జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఇక్కడ పుల్వామా, శోపియాన్ జిల్లాల్లో ఈసారి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అనంత్‌నాగ్‌తో పాటూ లద్దాఖ్ స్థానానికి ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.
బంగాల్లో భారీగా బలగాలు...
ఎన్నికల వేళ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది.