వైరస్ మానవాళిని అతలాకుతలం చేస్తున్న వేళ.. ఓ కరోనా యోధుడి కన్నీటి గాథ హృదయం ద్రవించేలా ఉంది. రోజంతా పనిచేసి ఇంటికి వెళితే తన చిరునవ్వుతోనే అలసట మాయం చేసే.. మూడేళ్ల కుమారుడి కడసారి స్పర్శకు నోచుకోలేకపోయాడు ఆ తండ్రి. గుండెలో బాధ దిగమింగుకుంటూనే.. గంభీర వదనంతో అంత్యక్రియల వద్ద కూడా భౌతిక దూరాన్ని పాటించాడు. కళ్లు చెమర్చే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
లఖ్‌నవూ లోక్‌బంధు ఆస్పత్రిలో వార్డ్‌బాయ్‌గా సేవలు అందిస్తున్నాడు మనీశ్‌కుమార్. శనివారం రాత్రి కరోనా ఐసొలేషన్ వార్డులో విధుల్లో ఉన్నాడు. అప్పుడే అతనికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. కుమారుడు హర్షిత్ శ్వాస తీసుకోలేకపోతున్నాడని, కడుపు నొప్పితో బాధ పడుతున్నట్లు సమాచారం అందింది. అనంతరం అది విషాద వార్తగా మారింది.
"నేను ఆ కాల్ అందుకునే సమయంలో పూర్తిగా అలసిపోయి ఉన్నాను. అయితే వెంటనే ఆస్పత్రిని విడిచిపెట్టి వెళ్లలేకపోయాను. మా కుటుంబసభ్యులు నా కుమారుడిని వేరొక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లాడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడో ఫొటోలు తీసి పంపించడం ప్రారంభించారు. రెండు గంటల సమయంలో చిన్నారి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. పిల్లాడిని చూడాలని ఆశగా ఉంది. అదే సమయంలో వైరస్ బాధితులను వదలి వెళ్లాలని అనిపించలేదు. అయితే వెంట వెంటనే ఫోన్లు రావడం.. నా ముఖంలో వేదన చూసి ఏదో జరిగి ఉంటుందని గుర్తించి.. ఇంటికి వెళ్లాలని ఒత్తిడి చేశారు నా సహచరులు."