రాబోయే రోజుల్లో కేంద్రం పరిధిలోని అన్ని ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. ఇందుకోసం నూతనంగా జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని వల్ల లాభాలేంటి? నిరుద్యోగులకు ఏ విధంగా మేలు జరుగుతుందనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఎన్‌ఆర్‌ఏ ఏంటి?
- కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఉమ్మడి పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ.
- ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలో పనిచేసే అధికారి దీనికి ఛైర్మన్గా వ్యవహరిస్తారు.
- దిల్లీలో ఎన్‌ఆర్‌ఏ ప్రధానకార్యాలయం ఏర్పాటు చేస్తారు.
- 117 జిల్లాల్లో పరీక్ష నిర్వహణ కోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తారు.
- ఇందుకోసం ప్రభుత్వం రూ. 1,517.57 కోట్లు మంజూరు చేసింది.
ఏం చేస్తుంది?
- ఒకే అర్హత అవసరమనున్న పలు రకాల ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తుంది.
- ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహించి గ్రూప్ బీ, గ్రూప్ సీ(నాన్ టెక్నికల్) పోస్టులకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుంది.
ఉమ్మడి పరీక్ష అంటే?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి 20 సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో మూడు సంస్థలు మాత్రమే ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత నిర్ణయంతో అన్ని సంస్థలకు కలిపి ఒకటే పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించనున్నారు.
పరీక్ష రాస్తే ప్రయోజనం?
- వివిధ ఏజెన్సీలు నిర్వహించే పరీక్షలన్నింటికీ వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
- పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రతిసారి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయనక్కర్లేదు.
- ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మూడేళ్ల పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నిర్వహణ ఎలా?
సీఈటీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ పర్సనల్ (ఐబీపీఎస్) కోసం సీఈటీ తొలి దశ పరీక్షలు ఉంటాయి.
ఎవరెవరు, ఎక్కడెక్కడ రాయొచ్చు?
సీఈటీని డిగ్రీ, పన్నెండు, పది తరగతులు ఉత్తీర్ణులైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా రాయవచ్చు. దేశవ్యాప్తంగా 117 జిల్లాలో ఈ పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.
దీని వల్ల లాభమేంటి?