ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 1584 కోట్లు కేటాయించింది. మొత్తం పథకానికి రూ. 22 వేల 810 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో 58.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు.
కొత్త ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కొత్త నియామకాలు చేపడితే.. రెండేళ్ల వరకు ఉద్యోగి, యజమాని వాటా కింద పదవీ విరమణ నిధికి జమ చేయాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే అందిస్తుంది.
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన అంటే..?
- ఈపీఎఫ్ఐ పరిధిలోని సంస్థ కొత్త ఉద్యోగిని(గతంలో పీఎఫ్‌లో చేరనివారు లేదా ఉద్యోగం కోల్పోయిన వారు) చేర్చుకుంటే.. సంస్థకు, ఉద్యోగికి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో రాయితీ.
- రెండేళ్ల పాటు సంస్థ-ఉద్యోగుల కంట్రిబ్యూషన్లు (24శాతం) ఆయా సంస్థలకు అందజేత.
- ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న సంస్థల్లో రూ. 15వేలు కన్నా తక్కువ జీతానికి చేరిన కొత్త ఉద్యోగికి వర్తింపు.
- కరోనా వల్ల 2020 మార్చి 1 అనంతరం ఉద్యోగం కోల్పోయి.. 2020 అక్టోబర్ 1 తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన వారు(రూ. 10వేల కన్నా తక్కువ జీతం) కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు.
- నిబంధన:- కనీసం 2 కొత్త ఉద్యోగాలు(50 కన్నా తక్కువ సిబ్బంది ఉన్న సంస్థలు), కనీసం 5 కొత్త ఉద్యోగాలు(సిబ్బంది 50కు పైబడిన సంస్థలు).
- 2021 జూన్ 30 వరకు ఈ పథకం అమలు.