కరవు భత్యంపై కేంద్రం కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది సర్కార్. కరవు భత్యం (డీఏ)ను 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈమేరకు డీఏ పెంపునకు ఆమోద ముద్ర వేసింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కరవు భత్యం ప్రస్తుతం ఉన్న 17 శాతం నుంచి 21 శాతానికి పెరగనుంది. దీంతో కేంద్రంపై అదనంగా రూ.14,595 కోట్లు భారం పడనుంది.
"48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదారులకు ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తించేలా కరవు భత్యాన్ని పెంచాలని నిర్ణయించాం. ఒక కోటి 13 లక్షల కుటుంబాలకు దీని వల్ల ప్రయోజనం చేకూరనుంది."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి.
కేబినెట్ నిర్ణయాలు..
- సంక్షోభంలో ఉన్న ఎస్ బ్యాంకులో ఎస్బీఐ 49 శాతం వాటా కొనుగోలు కోసం రూపొందించిన పునర్వ్యవస్థీకరణ పథకానికి ఆమోదం. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మూడు రోజుల్లో మారటోరియం ఎత్తివేతకు నిర్ణయం.
- ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లో సుమారు రూ.7,660 కోట్లతో 780 కిలోమీటర్ల హరిత జాతీయ రహదారుల నిర్మాణానికి ఆమోదం.
- కొబ్బరికి మద్దతు ధర క్వింటాలుకు రూ.439 పెంపు
- ఎగుమతులకు ఊతం ఇచ్చేలా ఎగుమతిదారులకు పన్నులు, డ్యూటీలను తిరిగి చెల్లింపునకు ఆమోదం.
ఇదీ చూడండి: కరోనా విజృంభణతో 'భారత్ బంద్' తరహా పరిస్థితి!