తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈశాన్య భారతంలో 'పౌర' బిల్లు సెగలు

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఈశాన్య భారత విద్యార్థి సమాఖ్య(నెసో) ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సినీతారలు సహా వివిధ వర్గాల ప్రజలు బంద్​లో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. త్రిపురలో 300 మంది నిరసనకారులను పోలీసులు నిర్బంధించారు.

cab
ఈశాన్య భారతంలో 'పౌర' బిల్లు సెగలు

By

Published : Dec 10, 2019, 4:51 PM IST

Updated : Dec 10, 2019, 8:06 PM IST

ఈశాన్య భారతంలో 'పౌర' బిల్లు సెగలు

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదంపై నిరసన తెలుపుతూ ఈశాన్య రాష్ట్రాలు నేడు బంద్​ పాటించాయి. ముస్లిమేతర శరణార్థులకు భారత్​లో ఆశ్రయం కల్పించాలన్న ప్రతిపాదితను వ్యతిరేకిస్తూ వందల సంఖ్యలో ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించారు. ఉదయం 5 గంటల నుంచే విద్యార్థులు రోడ్లపైకి వచ్చి బంద్ నిర్వహించారు.

బిల్లు చట్టంగా మారితే అనేకమంది స్థానికేతరులు ఈశాన్య రాష్ట్రాలకు వలస వచ్చే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ వలసల వల్ల స్థానికంగా ఉన్న గిరజన తెగల సంస్కృతిపై ప్రభావం పడుతుందని వాపోతున్నారు.

అసోం బంద్

అసోంవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను, దుకాణాలను నిరసనకారులు మూసేశారు. రాష్ట్ర రాజధాని గువహటిలో రోడ్లపై వాహన టైర్లను కాల్చి నిరసనలు చేపట్టారు. రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయం వద్ద ఆందోళనకారులు, పోలీసుల మధ్య స్పల్ప ఘర్షణ జరిగింది.

బంద్ కారణంగా సాధారణ జనజీవనం స్తంభించింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పరీక్షలు వాయిదా పడ్డాయి. దిబ్రూగఢ్ జిల్లాలో బంద్ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది, నిరసనకారులకు మధ్య బాహాబాహీ జరిగింది. అసోం చిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులు చాంద్​మారి ప్రాంతంలో నిరసనకు దిగారు.

మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి, అసోం రాష్ట్రానికి, లౌకికవాదానికి వ్యతిరేకమని అఖిల అసోం విద్యార్థి సమాఖ్య నేతలు ఆరోపించారు.

త్రిపురలోనూ

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా త్రిపుర రాజధాని అగర్తలలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి సమాఖ్య(నెసో) ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దలై జిల్లా మనుఘాట్ మార్కెట్​లో గిరిజనేతరులకు సంబంధించిన దుకాణాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మార్కెట్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

ఆందోళనలతో పశ్చిమ త్రిపుర, ఖోవాయి జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా రైలు సేవలు నిలిపేశారు. నిరసనలు చేస్తున్న 300మంది ఆందోళనకారులను పోలీసులు నిర్బంధించారు.

ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా 1000 మంది శాస్త్రవేత్తల పిటిషన్​

'పౌరసత్వ బిల్లుకు ఆమోదం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం'

Last Updated : Dec 10, 2019, 8:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details