దేశవ్యాప్తంగా త్వరలోనే పౌర సవరణ చట్టాన్ని అమలు చేయనున్నట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బంగాల్ పర్యటనలో ఉన్న ఆయన.. కరోనా వ్యాప్తి కారణంగానే సీఏఏ అమలు ఆలస్యమైనట్లు చెప్పారు.
2021లో జరిగే బంగాల్ శాసనసభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ఒకరోజు పర్యటనకు వచ్చిన నడ్డా.. సిలిగిరిలోని వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం భాజపా పనిచేస్తుంటే.. సీఎం మమతా బెనర్జీ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం విభజించు, పాలించు విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు నడ్డా. పౌర సవరణ చట్టం వల్ల అందరికీ ప్రయోజనం ఉంటుందన్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టాన్ని అమలు చేసేందుకు నరేంద్ర మోదీ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.