పౌరసత్వంపై కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ సవాల్ పౌరసత్వ చట్ట సవరణపై కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తూ.. దేశంలోని ముస్లింలను భయాందోళనకు గురి చేస్తోందని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విపక్షం.. ప్రజలను హింసాత్మక నిరసనలు చేసేలా రెచ్చగొడుతోందని మండిపడ్డారు.
ఝార్ఖండ్‌లోని భోగ్నాదిహ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని.. పౌరసత్వ చట్ట సవరణ వల్ల భారత పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగదని స్పష్టం చేశారు. ధైర్యముంటే.. పాకిస్థానీలకు భారత పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ బహిరంగంగా ఒప్పుకోవాలన్నారు.
"ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి... మరోసారి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వీరు( కాంగ్రెస్) దేశంలో అసత్యం, భ్రమ, అహింసలను వ్యాపింపజేస్తున్నారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం వల్ల భారత దేశంలో ఉన్న ఏ ఒక్క భారతీయుడిపైనా ప్రభావం పడదు. కాంగ్రెస్, తన మిత్ర పక్షాలు కలిసి అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. మేము రూపొందించిన చట్టం మన పక్క దేశాలవారికి సంబంధించింది. మూడు దేశాల్లో మతపరమైన హింసల వల్ల భారత్‌కు వచ్చే వారి కోసమే ఈ చట్టం తయారైంది. ఎవరైతే ఏళ్లుగా భారత్‌లో నివసిస్తూ.. తిరిగి వారి దేశానికి వెళ్లలేక దయనీయ స్థితిలో ఉన్నారో.. వారి కోసం మాత్రమే ఈ చట్టం. అసలు ఈ సవరణ ముస్లింల హక్కులకు ఎలా భంగం కలిగిస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. కాంగ్రెస్‌కు దాని మిత్రపక్షాలకు దమ్ము, ధైర్యం ఉంటే.. ప్రతి పాకిస్థానీ పౌరుడికి భారత పౌరసత్వం ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారని బహిరంగంగా ఒప్పుకోవాలి."
-ప్రధాని మోదీ.
ఇదీ చదవండి:బంగాల్లో మమత మరో ర్యాలీ- గువాహటిలో కర్ఫ్యూ ఎత్తివేత