తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దటీజ్ ఇండియన్ ఆర్మీ... మానవత్వంలోనూ భేష్ - భారత్​ చైనా సరిహద్దు ఉద్రిక్తత

దురాక్రమణలు... దాడులు... ఏకపక్ష కాల్పులు... సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలివి. డ్రాగన్​ సేన ఎంతగా రెచ్చగొడుతున్నా సహనంతోనే ఎప్పటికప్పుడు గట్టి జవాబు ఇస్తోంది భారత సైన్యం. ఇలాంటి యుద్ధ వాతావరణంలోనూ 'వసుధైక కుటుంబం' స్ఫూర్తిని, మానవత్వాన్ని చాటుతోంది. కష్టాల్లో ఉన్న చైనా పౌరులు, మూగజీవాలకు అండగా నిలిచి పొరుగు దేశ సైన్యంపై నైతికంగా పైచేయి సాధిస్తోంది.

India occupies high moral ground
దటీజ్ ఇండియన్ ఆర్మీ... మానవత్వంలోనూ భేష్

By

Published : Sep 8, 2020, 2:26 PM IST

Updated : Sep 8, 2020, 3:12 PM IST

ఆ సైన్యం కవాతు చప్పుడు వింటే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది...

యుద్ధరంగంలో కాలు కదిపితే శత్రుమూకలు చెల్లాచెదురై పోతాయి...

ఎముకలు కొరికే చలిలో వారి వేగం చూస్తేనే గుండె ఝల్లుమంటుంది...

ఇదీ మేటి ప్రపంచ దేశాల సైన్యానికి భారత సైన్యంపై ఉన్న అభిప్రాయం. అయితే ఇది ఒక వైపు మాత్రమే.

మరోవైపు శత్రువులే సలాం కొట్టే మానవత్వం.. కవ్విస్తున్నా సంయమనం కోల్పోని సహనం.. శత్రువుల గుండెలు చీల్చగలిగే సత్తా ఉన్నా శాంతితో మెలగడం.. ఇదీ భారత సైన్యం సరిహద్దులో చూపిస్తోన్న మానవత్వపు పరిమళం.

తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనా మధ్య తాజా ఉద్రిక్తతలకు సరిహద్దులో సెగలు రగులుతూనే ఉన్నాయి. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవు భాగంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను భారత్​ స్వాధీనంలోకి తెచ్చుకున్నాక వాస్తవాధీన రేఖ నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా యత్నిస్తూ ఆక్రమణవాదాన్ని చూపిస్తుంది. భారత్​ మాత్రం యుద్ధం చేసే సత్తా ఉన్నా శత్రువుకు శాంతి హస్తాన్ని చూపుతోంది. మానవత్వంలో చైనా సైన్యానికి అందనంత హిమోన్నత శిఖరాలకు చేరింది.

మూగజీవాలను అందజేసి...

అరుణాచల్​ప్రదేశ్​ తూర్పు భాగంలోని వాస్తవాధీన రేఖ వెంట గత నెల 31న చైనా వైపు నుంచి 13 జడల బర్రెలు, నాలుగు దూడలు భారత భూభాగంలోనికి ప్రవేశించాయి. అయితే ఆ మూగజీవాలను సంరక్షించిన భారత సైన్యం సెప్టెంబర్ 7న వాటిని చైనాకు అప్పగించినట్లు భారత సైన్యం తెలిపింది. ఇందుకు ప్రతిగా చైనా జవాన్లు కృతజ్ఞతలు తెలిపారని.. ఇలాంటిది మరోసారి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారని భారత్​ సైన్యం వెల్లడించింది.

మూగజీవాలను చైనా సైన్యానికి అందజేస్తున్న భారత సైనికులు

చైనా మాత్రం...

సెప్టెంబర్​ 3న అడవిలో కస్తూరీ జింకల కోసం వేటకు వెళ్లిన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పౌరులను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులు అపహరించారు. ఎగువ‌ సుబన్‌సిరి జిల్లాలో నాచో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వారి నుంచి ఇద్దరు తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల చైనా వంచన బయటపడింది. అయితే సెప్టెంబర్​ 7న ఈ ఘటనపై చైనా సైన్యం స్పందించింది. ఇలాంటి విషయమేమీ తమకు తెలియదని కపట ప్రదర్శన చేసింది.

అదే రోజు...

సెప్టెంబర్​ 3న భారత్​లోని ఉత్తర సిక్కిం ప్రాంతానికి దారి తప్పి కారులో చేరుకున్న ముగ్గురు చైనీయులను భారత సైన్యం రక్షించింది. సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తు, సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతతో అక్కడి వాతావరణ స్థితి అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో అల్లాడుతున్న చైనీయులకు భారత సైన్యం సాయం చేసింది. వారికి ఆక్సిజన్‌, ఆహారం, వెచ్చని దుస్తులు అందించటమే కాకుండా వారు తిరిగి వెళ్లేందుకు దారి చూపింది.

చైనీయులను కాపాడిన భారత సైన్యం
చైనీయులను కాపాడిన భారత సైన్యం
చైనీయులకు ఆహారం అందిస్తున్న భారత సైన్యం

ప్రతిసారి చైనా సైన్యం కఠినంగా వ్యవహరిస్తున్నా, కవ్విస్తున్నా.. భారత్ మాత్రం మానవత్వాన్నే పంచుతోంది. అయితే భారత శాంతిమంత్రాన్ని చేతకానితనంగా తీసుకుంటే చైనాకు గల్వాన్​ ఘర్షణలో ఎదురైన పరాభావం మరోసారి తప్పదని ఇప్పటికే పలుమార్లు భారత్​ హెచ్చరించింది.

-సంజీవ్ కుమార్​ బారువా

Last Updated : Sep 8, 2020, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details