అడవిలో చెట్లు ఎలా ఉంటాయి? అదేం ప్రశ్న.. ఆకుపచ్చగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాలా.. అంటారా? అవును నిజమే, సాధారణంగా అటవీ ప్రాంతమంతా పచ్చదనం పులుముకుని పులకరిస్తూ కనిపిస్తుంది. కానీ, కేరళ అడవుల్లోని చెట్లు మాత్రం మరోసారి బూడిద రంగులో కళకళలాడుతున్నాయి. అవును, లక్షలాది బూడిద రంగు సీతాకోక చిలుకలు పచ్చని చెట్లను కప్పేశాయి మరి.
ఏటా లక్షలాది తుమ్మెదలు శీతాకాల విడిదికై ఈ అడవుల్లోకి వస్తాయి. పశ్చిమ కనుమల్లోని సతత హరిత, పాక్షిక సతత హరిత అడవుల్లో తుమ్మెదలన్నీ ఒక్కచోట చేరి అందాలు విరజిల్లుతాయి. దాదాపు రెండు వందలకు పైగా సీతాకోకచిలుక జాతులు ఈ అడవిలో విహారం చేస్తాయి. వీటిలో ఈ బ్లూ టైగర్ హార్న్ జాతికి చెందిన బూడిద రంగు భ్రమరాలు మాత్రం ఇలా మహా వృక్షాలనే కప్పేస్తున్నాయి. ఈ సుందర దృశ్యాల్ని చూసి ప్రకృతి ప్రియులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు.