కేరళలోని కాసరగోడ్‌లో బర్ఫ్లవర్ చెట్టు పూలు ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా పూలు వికసించిన ఏ ప్రాంతమైనా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే అటువంటి ప్రాంతాలంటే అందరికీ ఇష్టమే. అయితే బర్ఫ్లవర్ చెట్టు పూలకు ఓ విశేషం ఉంది. మహమ్మారి కరోనా వైరస్ ఆకారాన్ని పోలి ఉండడమే వీటి ప్రత్యేకత. వార్తా పత్రికలు, టీవీల్లో చక్కర్లు కొడుతున్న కరోనా వైరస్ చిత్రంలాగా.. అచ్చుగుద్దినట్లు అదే రూపంలోనే ఉన్నాయి ఈ పూలు.
కదాంబు మారమ్
బర్ఫ్లవర్ చెట్టును మలయాళంలో 'కదాంబు మారమ్' లేదా 'అట్టు తెక్కు' అని పిలుస్తారు. 'ఆంథ్రోసీఫాలస్ కదాంబ' అనేది ఈ చెట్టు సాంకేతిక నామం. ఇది కొండ ప్రాంతాల్లో పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కొవిడ్-19 సంక్షోభంలో చిక్కుకున్నందున ఈ ఏడాదే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి ఈ పూలు.