తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బడ్జెట్​ 2020 : మాంద్యంపై 'నిర్మల పద్దు' సమరశంఖం - కేంద్ర బడ్జెట్ 2020

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కొనుగోలు శక్తి, ఉపాధి అవకాశాలు పెంచేలా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధికి భారీ కేటాయింపులు చేసింది. ఆదాయ పన్ను స్లాబులు, రేట్లలో కీలక మార్పులు చేస్తూనే.... 'మినహాయింపుల' పేరిట మెలిక పెట్టింది.

Budget cuts personal income tax, raises customs duty
బడ్జెట్​ 2020 : మాంద్యంపై 'నిర్మల పద్దు' సమరశంఖం

By

Published : Feb 1, 2020, 7:05 PM IST

Updated : Feb 28, 2020, 7:33 PM IST

బడ్జెట్​ 2020 : మాంద్యంపై 'నిర్మల పద్దు' సమరశంఖం

మాంద్యం ఊబిలో చిక్కుకుపోయి.. వృద్ధి రోజురోజుకూ క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్​ను రూపొందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్​ రెండోసారి పద్దును పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు.

మొత్తం రూ. 30,42,230 కోట్లతో రూపొందిన వార్షిక బడ్జెట్​లో.. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి అగ్రతాంబూలం అందించారు. వ్యవసాయరంగం అభివృద్ధికి 16 సూత్రాల పథకం తీసుకొచ్చారు. విద్య, ఇంధనం, వాణిజ్యం, పట్టణ, గ్రామీణాభివృద్ధి, వైద్యం, సామాజిక సంక్షేమం, టెలికాం రంగాలకు పెద్దపీట వేశారు. భారత్​ 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యాన్ని అందుకునే దిశగా బడ్జెట్​లో కేటాయింపులు చేసింది కేంద్రం.

బడ్జెట్​ వివరాలు

కేంద్ర బడ్జెట్ -ఆదాయ వ్యయాలు (రూ. కోట్లలో)

  • మొత్తం బడ్జెట్ 30,42,230
  • రెవెన్యూ ఆదాయం 20,20,926
  • మూలధన రాబడి 10,21,304
  • మొత్తం వ్యయం 30,42,230
  • రెవిన్యూ లోటు 6,09,219
  • ప్రభావిత రెవెన్యూలోటు 4,02,719
  • ద్రవ్య లోటు 7,96,337
  • ప్రాథమిక లోటు 88,134

ఆశావహ భారతం, సబ్‌కా సాథ్-సబ్‌కా వికాస్‌, ప్రజా సంక్షేమమనే మూడు ప్రధాన లక్ష్యాలతో రూపొందింది బడ్జెట్. ఇందులో తొలి ప్రాధాన్యాంశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి.. ద్వితీయంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు.. తృతీయ ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమాన్ని నిర్దేశించుకుంది కేంద్రం.

"భారత్​​ ప్రస్తుతం అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014-19 మధ్య 190 బిలియన్ డాలర్ల నుంచి 284 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2019 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలు 52.2 నుంచి 48.7 శాతానికి తగ్గించాం. ఈ బడ్జెట్ మూడు ప్రధానాంశాలపై ఆధారపడి ఉంది. మొదటిది నవభారత నిర్మాణం.. ఇందులో అందరికీ మెరుగైన జీవన సౌకర్యాలు, ఆరోగ్యం, మంచి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండోది ఆర్థిక అభివృద్ధి.. సబ్​కా సాథ్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్ అనే ప్రధాని నినాదంతో ఆర్థిక సంస్కరణలు చేపడతాం. ఇందులో భాగంగా అధిక ఉత్పాదకత, నైపుణ్యతను సాధించేందుకు కృషి చేయనున్నాం. మూడోది సంక్షేమ రాజ్యం.. మానవత, కారుణ్యం లక్ష్యాలుగా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసి అందరి విశ్వాసం చూరగొంటాం."
- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

కేటాయింపుల్లో రక్షణకే టాప్​

బడ్జెట్‌ కేటాయింపుల్లో భాగంగా.. దేశ భద్రతకు కీలకమైన రక్షణ రంగానికి ఈసారి కూడా పెద్ద పీట వేశారు. 3లక్షల 23 వేల 53 కోట్ల రూపాయలు కేటాయించారు.

కేంద్ర బడ్జెట్‌-కేటాయింపులు(కోట్లలో)

కేంద్ర బడ్జెట్​ సమగ్ర స్వరూపం (రూ. కోట్లలో)
  • రక్షణరంగం 3,23,053
  • పింఛన్లు 2,10,682
  • ప్రధాన రాయితీలు 2,27,794
  • వ్యవసాయం, అనుబంధరంగాలు 1,54,775
  • పరిశ్రమలు-వాణిజ్యం 27,227
  • ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి 3,049
  • విద్యారంగం 99,312
  • ఇంధనం 42,725
  • విదేశీ వ్యవహారాలు 17,347
  • ఆర్థికశాఖ 41,829
  • వైద్యం 67,484
  • హోంశాఖ 1,14,387
  • వడ్డీలు 7,08,203
  • టెలికాంశాఖ 59,349
  • ప్రణాళిక, గణాంకశాఖ 6,094
  • గ్రామీణాభివృద్ధి 1,44,817
  • శాస్త్రసాంకేతికశాఖ 30,023
  • సామాజిక సంక్షేమం 53,876
  • పన్నుల విభాగం 1,52,962
  • రాష్ట్రాలకు బదిలీ 2,00,447
  • రవాణాశాఖ 1,69,637
  • కేంద్రపాలిత ప్రాంతాలు 52,864
  • పట్టణాభివృద్ధి 50,040
  • ఇతర కేటాయింపులు 84,256


16 సూత్రాల ప్రణాళిక

రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా 16 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక ఆవిష్కరించింది కేంద్రం. వ్యవసాయంలో యువత, మహిళల భాగస్వామ్యానికి బడ్జెట్​లో కార్యచరణ సిద్ధం చేసింది కేంద్రం. గ్రామ, తాలూకా స్థాయిల్లో స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలు వీటిని నిర్వహించొచ్చని పేర్కొన్నారు. గ్రామీణ యువత కోసం సాగర్​ మిత్ర పథకం ద్వారా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపారు.

"రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకొని, వ్యయాలను తగ్గించుకునేందుకు... గ్రామ స్టోరేజ్ స్కీమ్​ను ప్రవేశపెట్టనున్నాం. ముద్ర, నాబార్డ్​ రుణాల ద్వారా గ్రామ స్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాలు వీటిని నిర్వహించవచ్చు. తద్వారా మహిళలు తమ ధాన్యలక్ష్మీ హోదాను నిలబెట్టుకుంటారు. సముద్ర వేట అభివృద్ధి, నిర్వహణకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసింది. తీర ప్రాంతాల్లోని యువకులు దీని ద్వారా లబ్ది పొందనున్నారు. 2022-23 నాటికి 200 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. 3,477 సాగర్​మిత్ర, 500 చేపల ఉత్పత్తి వ్యవసాయదారుల ఆర్గనైజేషన్​ల ఏర్పాటు ద్వారా చేపల ఉత్పత్తిలో యువకులను భాగస్వామ్యం చేయనున్నాం. తీర ప్రాంతాల్లోని యువకులు సాగర్​ మిత్ర ఆధ్వర్యంలో పనిచేస్తారు."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

ఆదాయపన్నులో భారీ మార్పులు

ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా ఈ పద్దులో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యక్తిగత పన్ను చెల్లింపు విధానంలో సంస్కరణలు చేపట్టిన ఎన్డీఏ సర్కార్.. ప్రస్తుతమున్న
నాలుగు స్లాబ్‌లను ఏడు స్లాబ్‌లుగా మార్చింది. అయితే పన్ను చెల్లింపుదారులకు నూతన విధానం ఐచ్ఛికం మాత్రమేనని, కావాలనుకుంటే ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.

నూతన స్లాబులను పరిశీలిస్తే..

  • 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు.
  • 2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం
  • 5 లక్షల నుంచి 7.50 లక్షల వరకు 10 శాతం
  • 7.50 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం
  • 10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20 శాతం
  • 12.50 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం
  • 15 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారికి 30 శాతం


ఎల్​​ఐసీలోని ప్రభుత్వవాటా విక్రయానికి

మిషన్ ఇంద్ర ధనుష్‌ పథకం కిందకు మరిన్ని ఆసుపత్రులను తీసుకురానున్నారు. దీని అమలులో నిధుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పద్ధతిలో కొత్త పథకాన్ని అమలు చేయనున్నారు. పన్ను చెల్లింపుదారులపై వేధింపులకు స్వస్తి పలికే 'పన్ను చెల్లింపు చార్టర్'​ను తీసుకురానున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా విక్రయించేందుకు నిర్ణయించింది. డిపాజిటర్ల రుణ పరిమితిని 5 లక్షలకు పెంచింది.

బడ్జెట్​లోని మరిన్ని ముఖ్యాంశాలు

  • నాన్​ గెజిటెడ్​ పోస్టుల నియామకం కోసం జాతీయ స్థాయిలో రిక్రూట్​మెంట్​ ఏజెన్సీ ఏర్పాటు. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ ఓ పరీక్షా కేంద్రం.
  • రానున్న మూడేళ్లలో సంప్రదాయ విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు.
  • పర్యటక ప్రదేశాలను కలిపేందుకు మరిన్ని సెమీ హైస్పీడ్ తేజస్ రైళ్లు.
  • ఉడాన్ పథకానికి మద్దతుగా కొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి.
  • ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి సరళీకరించిన జీఎస్టీ రిటర్ను విధానం అమలు.
  • పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో 'కిసాన్‌ రైల్‌' ఏర్పాటు.
  • నేషనల్‌ పోలీస్‌ యూనివర్సిటీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ ఏర్పాటు.
  • ఐదు కొత్త స్మార్ట్‌ సిటీల అభివృద్ధి.
  • ఎన్‌బీఎఫ్‌సీలకు తాత్కాలిక రుణ హామీ.
  • 2020-21 నామినల్‌ జీడీపీ 10శాతంగా ఉంటుందని అంచనా.
  • ఆధార్‌ను తీసుకొని ఇన్‌స్టెంట్‌గా 'పాన్‌'ను జారీ చేసే వ్యవస్థ ఏర్పాటు.
  • చౌక గృహాల నిర్మాణానికి టాక్స్‌హాలిడే కొనసాగింపు.
  • కంపెనీలపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్ను తొలగింపు.
Last Updated : Feb 28, 2020, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details