తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పద్దు 2019: రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం!

"ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే... రైతుల ఆదాయం రెట్టింపునకు మరో 28ఏళ్లు పడుతుంది"... వ్యవసాయ నిపుణుల అంచనా ఇది. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం మాత్రం మూడేళ్లే. ఇదెలా సాధ్యం? లక్ష్యసాధన కోసం మోదీ సర్కార్​ ఎలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టనుంది? ఇందుకోసం బడ్జెట్​లో ఏమేర కేటాయింపులు జరపనుంది?

పద్దు 2019: రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం!

By

Published : Jul 2, 2019, 6:19 PM IST

రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా కేంద్రం అడుగులు

లక్ష్యం... రైతుల ఆదాయం రెట్టింపు. అందుకు నిర్దేశించుకున్న గడువు... 2022. అంటే... మూడేళ్లకన్నా తక్కువ వ్యవధి. ఇంత తక్కువ సమయంలో ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయం నెరవేరుతుందా? అంత సులువు కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇందుకు కారణం... సాగు ఎదుర్కొంటున్న దుస్థితే. ప్రస్తుతం వ్యవసాయ రంగం వృద్ధి 2 నుంచి 3 శాతం వరకే ఉంటుంది. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే 15 నుంచి 17 శాతం వృద్ధి అవసరం అన్నది నిపుణుల విశ్లేషణ. సాగు రంగంలో ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించేందుకు విప్లవాత్మక చర్యలు చేపట్టకపోతే... రైతుల ఆదాయం రెట్టింపునకు మరో 28 ఏళ్లు పడుతుందన్నది వారి అంచనా.

వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తొలి దఫా పాలన నుంచే చెబుతూ వస్తోంది మోదీ సర్కార్. అందుకు తగినట్లు ఎన్నికల మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చింది.

భాజపా హామీలివే...

⦁ దేశంలోని రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమలు

⦁ 60 ఏళ్లు దాటిన సన్న, చిన్న కారు రైతులందరికీ పింఛను

⦁ వ్యవసాయ, గ్రామీణ వ్యవస్థలో రూ. 25 లక్షల కోట్లు పెట్టుబడులకు హామీ.

⦁ జాతీయ రహదారుల వెంట వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం నేషనల్ వేర్ హౌసింగ్ గ్రిడ్‌

⦁ మార్కెట్ అనుసంధానానికి ఉపయోగపడేలా 2022 నాటికి కొత్తగా 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు.

⦁ రైతులకు సలహాలు, పెట్టుబడి అవసరాలు, మార్కెటింగ్‌కు సంబంధించి కీలకమైన సహకార సంఘాలు బలోపేతం చేయటం.

⦁ ఎగుమతులకు ప్రోత్సాహకాలు.

జలశక్తి కోసం...

ప్రధానమంత్రి క్రిషి సంచాయ్ యోజన ద్వారా దేశంలో పూర్తి స్థాయిలో సాగునీటి పారుదల సామర్థాన్ని ఉపయోగించుకునేందుకు కృషి చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. కోటి హెక్టార్ల వ్యవసాయ భూమిని కొత్తగా మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకురావటం వంటివి ఇందులో ప్రధానాంశాలుగా పేర్కొంది.

వ్యత్యాసం అక్కడే...

దేశంలో 50 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు ఈ రంగానికి బడ్జెట్​లో 20 నుంచి 30 శాతం నిధులు కేటాయించేవారు. ప్రస్తుతం ఆ విలువ 3 నుంచి 5 శాతమే. భాజపా

ఇచ్చిన భారీ హామీలను నెరవేర్చాలంటే కేటాయింపులు భారీగా పెంచడం ఎంతో కీలకం. ఆ దిశలో ఏమేరకు ముందడుగు పడుతుందన్నది ఆసక్తికరం.

ఎలాంటి చర్యలు ఉండొచ్చు..

బడ్జెట్ సన్నాహకాల్లో భాగంగా వ్యవసాయ రంగంపై జరిగిన భేటీలో రైతు ఉత్పాదకతను పెంచటం సహా ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచించారు. వీటి ఆవశ్యకతపై ప్రధానమంత్రి పలుమార్లు సమీక్షించారు. ఆయా ప్రతిపాదనలకు తగినట్లు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు కోసం కేటాయింపులతో పాటు రైతులకు అందించే పింఛను పథకం, నీటి పారుదలకు కేటాయింపులు పెరగొచ్చు.

బడ్జెట్‌ సన్నాహక సమావేశాల్లో వ్యవసాయానికి సంబంధించిన అంకుర సంస్థలపైనా నిర్మలా సీతారామన్ దృష్టి సారించారు. వీటికీ ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ పెట్టుబడులు పెంచటం ఖాయంగా కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details