బడ్జెట్ 19: ధరల మోత ఈ వస్తువులపైనే... దేశ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు విత్తమంత్రి నిర్మలా సీతారామన్. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రక్షణ రంగ వస్తువులపై పూర్తిస్థాయి ప్రాథమిక సుంకాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 2 రూపాయలు మేర సుంకం పెంచుతున్నట్లు తెలిపారు. బంగారం సహా ఇతర విలువైన ఆభరణాలపై రెండున్నర శాతం సుంకం మోపారు.
"రక్షణరంగానికి సంబంధించి విదేశాల్లో తయారై ఇక్కడకు దిగుమతి చేసుకునే వాటిపై ఉన్న ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నాం. దేశంలో తయారవుతున్న ఎలక్ట్రానిక్ వాహనాల విడిభాగాలపైనా సుంకాన్ని తొలగిస్తున్నాం. పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు అదనంగా ఎక్సైజ్ సుంకం రూపాయి మేర, రోడ్లు- మౌలిక వసతుల సుంకాన్ని రూపాయి మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. బంగారం సహా ఇతర విలువైన ఆభరణాలపై ఉన్న సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నాం. "
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ సంస్థలకు ఊతం ఇచ్చేందుకు కొన్నిరకాల ముడి సరకులపై సుంకం తగ్గించారు ఆర్థిక మంత్రి. మరో 36 వస్తువులపై పన్నుల మోత మోగించారు. జీఎస్టీ రాక ముందు కేసుల్లో చిక్కుకొని రాకుండా నిలిచిపోయిన 3.75 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పరిష్కారం కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. కస్టమ్స్ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణలను ప్రతిపాదించారు నిర్మల.
బడ్జెట్లో భాగంగా పన్నుల మోతతో పెట్రోల్, డీజిల్, సిగరెట్స్, పొగాకు ఉత్పత్తులు, బంగారం, వెండి, విదేశీ కార్లు, ఏసీలు, లౌడ్ స్పీకర్లు, సీసీటీవీ కెమెరాలు, ఖరీదైన గృహోపకరణాలు, న్యూస్‌ప్రింట్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాల విడిభాగాలతో మొత్తం 36 వస్తువుల ధరలు ప్రియం కానున్నాయి. విద్యుత్ వాహనాలు, కెమెరా పరికరాలు, మొబైల్ ఛార్జర్లు, సెట్‌టాప్ బాక్సులు, భారత్‌లో తయారు కానీ దిగుమతి చేసుకునే రక్షణ రంగ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.
ఇదీ చూడండి:'అంకురాలకు మరింత ప్రోత్సాహం, ప్రత్యేక ఛానెల్'